Jagan-Mohan-Reddy Ap Chief Minister Amma Vodi Schemeపేద పిల్లలకు విద్యను చేరువ చేయడానికే నవ రత్నాలలో ఒకటైన “అమ్మఒడి” పథకాన్ని రూపొందించిన వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు ఈ రత్నం అందుకోవడానికి విద్యార్థుల తల్లితండ్రులకు “ఆంక్షల” పధకాన్ని ప్రవేశపెట్టారంటూ ప్రతిపక్షాలు గగ్గోలుపెడుతున్నాయి.

గతంలో పిల్లలను బడికి పంపిస్తే చాలు ఒక్కో విద్యార్థికి 15వేలు చప్పున వారి తల్లి అకౌంట్లలో ప్రభుత్వమే నేరుగా జమ చేస్తామని చెప్పి ఇప్పుడు ఒక్కో విద్యార్థికి కాదు, ఇంటికి ఒక పిల్లవాడికే అంటూ ఈ పథకం అమలుకు మొదటిసారి మడం తిరిపారు.కాలానుగుణంగా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మరిన్ని ఆంక్షను తెర మీదకు తెచ్చి మాట తప్పడమే కానీ మాట నిలబెట్టుకునే పరిస్థితులలో వైసీపీ ప్రభుత్వం లేదనేది యదార్ధం.

కరోనా కష్ట కాలంలో బతుకు జీవుడా అంటూ ప్రజలు పోరాటం చేసిన వైనంలో పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతం 75%వుండాల్సిందే అంటూ కొత్త నిబంధనకు రూపకల్పన చేశారు. 75% హాజరు నమోదైన పిల్లల తల్లులకు మాత్రమే అమ్మఒడి అంటూ ప్రభుత్వ ‘పధకాల ఒడి’ నుండి లబ్ధిదారులను ఒక్కొక్కరిగా దూరం చేస్తూ వచ్చారు వైసీపీ నాయకులు అంటూ టీడీపీ నేతలు ప్రభుత్వం పై విరుచుకుపడుతున్నారు.

ఒకో ఆర్ధిక సంవత్సరానికి ఒక్కో నిబంధనతో అమ్మఒడికి ఆంక్షలు విధించడం సబబుకాదంటూ లబ్ధిదారులు ప్రభుత్వానికి సూచన చేస్తున్నారు. అమ్మఒడి పొందాలంటే కరెంట్ బిల్లులో యూనిట్ల వాడకంతో లింక్ పెట్టి కొన్ని ఒడులకు ఈ మొత్తాన్ని కట్ చేశారు జగన్ ప్రభుత్వం.

ప్రతి ఏడాది జనవరిలో అమ్మఒడి ఇస్తామని చెప్పిన జగన్ ఈఏడాది మాత్రం జూన్ నుంచి ఇస్తామని చెప్పడంతో ఒక ఏడాది అమ్మఒడిని జగన్ లబ్ధిదారులకు దూరంచేశారని సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటుంది ప్రభుత్వం. మరుగుదొడ్ల నిర్వహణ పేరుతో వెయ్యి రూపాయలు కోత విధించి ఆ మొత్తాన్ని 14వేలకు కుదించింది వైసీపీ ప్రభుత్వం.

ఇప్పుడు జగన్ ప్రభుత్వం మరో సారి మడం తిప్పడానికి సిద్ధమైందని,ఈ సారి కారణంగా కొత్త జిల్లాల పేరును తెర మీదకు తీసుకువచ్చిందంటూ టీడీపీ శ్రేణులు ప్రభుత్వాన్ని ఎద్దేవా చేస్తున్నారు. ఏర్పాటైన కొత్త జిల్లాల ప్రకారంగా అమ్మ ఒడి ప్రయోజనం పొందాలంటే ఆధార్ ని అనుసంధానం చేస్తూ అందుకు తగ్గ మార్పులను సరిచేసుకోవాలంటూ మరో ఆంక్షను సిద్ధంచేసింది ప్రభుత్వం.

వైసీపీ ప్రభుత్వం తలకు మించిన ఆర్ధిక భారాలతో ప్రభుత్వాన్ని నడపలేక ఆంక్షల పేరుతో, నిబంధనల సాకుతో,పరిమితులు పెట్టుకుంటూ పధకాల లబ్దిదారులను తగ్గించే ప్రయత్నం చేస్తుందంటూ జగన్ ఓటుబ్యాంక్ వర్గీయులే వాపోతున్నారు.