YSRCP-Office-Lands-YS-jaganవడ్డించేవాడు మనోడైతే బంతిలో ఎక్కడ కూర్చోన్నా విస్తరిలో అన్నీ వచ్చి పడతాయన్నట్లు అధికారం చేతిలో ఉంటే అస్మదీయులకే అన్నీ దక్కుతుంటాయి. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం కూడా అదే చేస్తోంది. రాష్ట్రంలో ప్రధాన నగరాలు, పట్టణాలలో కోట్లు విలువచేసే ప్రభుత్వ భూములను వైసీపీ కార్యాలయాలు నిర్మించుకోవడానికి ఏడాదికి ఎకరానికి కేవలం రూ.1,000 చొప్పున 33 ఏళ్ళకి లీజుకి ఇచ్చేస్తోంది. ఇప్పటికే పలు జిల్లాలలో ప్రభుత్వం కేటాయించిన ఆ భూములలో వైసీపీ కార్యాలయాల నిర్మాణ పనులు మొదలైపోయాయి కూడా.

1. విజయవాడలో సితార సెంటర్ వద్ద విద్యాధరపురంలో 1,850 చదరపు గజాలను వైసీపీకి కేటాయించింది.

2. అనకాపల్లి జిల్లా రాజుపాలెం గ్రామంలోని సర్వే నంబర్ 75/3లో 1.75 ఎకరాల భూమిని, విశాఖపట్నంలో జాతీయ రహదారి పక్కనే ఉన్న భూమిలో కాపు సామాజిక భవనం కోసం కేటాయించిన భూమిలో కొంత భాగాన్ని వైసీపీ కార్యాలయం కోసం ప్రభుత్వం అప్పగించింది.

3. కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం పట్టణంలో జన్నుపల్లిలో సర్వే నంబర్: 48/2లో ఒక ఎకరం భూమిని వైసీపీ కార్యాలయం కోసం కేటాయించగా గ్రామ పంచాయతీ దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ తీర్మానం చేసింది. పట్టణంలో కలెక్టరేట్ కార్యాలయం కోసం భూమి దొరకడం లేదని చెప్పిన అధికారులే వైసీపీ కార్యాలయం కోసం కోట్లు విలువచేసే ఈ భూమిని కేటాయించారు.

ఇంకా కడప, పల్నాడు, రేణిగుంట, పుట్టపర్తి, నరసారావుపేటలో వందల కోట్లు విలువచేసే ప్రభుత్వ భూములను వైసీపీ కార్యాలయాలకు కేటాయించుకొంది. ఆ భవనాలకు భూములు కేటాయించుకోవడం వరకే ఆగుతుందా లేదా వాటి నిర్మాణాలకి అయ్యే ఖర్చుని కూడా ప్రభుత్వమే ఏదో పద్దులో చెల్లించేస్తుందో? ప్రభుత్వం ఆస్తులకు, ఆదాయానికి ధర్మకర్తగా ఉంటూ వాటిని కాపాడాల్సి ఉండగా, ఈవిదంగా తన సొంత పార్టీకి అప్పనంగా భూములు కేటాయించుకోవడం అధికార దుర్వినియోగానికి పాల్పడటమే అవుతుంది. త్వరలోనే దీనిపై హైకోర్టులో పిటిషన్లు పడకమానవు.. అప్పుడు మొట్టికాయలు తప్పదు.