andhra pradesh governement books 2 special trains for Dharma Porata Deekshaపార్లమెంట్ బడ్జెట్ సమావేశాల చివరి రోజున అనగా ఈ నెల 11న ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం చేసిన చేస్తున్న అన్యాయాలపై ఢిల్లీలో దీక్ష చేయబోతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, వారి అనుచరులు, సామాన్య ప్రజలను కూడా దీంట్లో భాగస్వామ్యులను చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలకు ఈ నిరసన దీక్షలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానాలు పంపారు. వారి స్పందన ఏంటో తెలియాల్సి ఉంది. వైకాపా రాదు అనే విషయం తెలిసిందే.

కాంగ్రెస్ పార్టీ, జనసేన, వామపక్షాలు ఎటువంటి నిర్ణయం తీసుకుంటాయో చూడాలి. మరోవైపు ఈ దీక్ష గురించి ఒక వివాదం చెలరేగింది. దీక్ష కోసం ఢిల్లీ చేరుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం రెండు స్పెషల్ ట్రైన్లు బుక్ చేసింది. ఆ ట్రైన్ల ద్వారా ఉచితంగా దేశరాజధాని చేరుకోవచ్చు. ఈ ట్రైన్లు శ్రీకాకుళం నుండి, అనంతపురం నుండి బయలుదేరుతాయి. ఈ రెండు ట్రైన్ల కోసం రైల్వే శాఖకు 1,12,16,465 రూపాయిలు విడుదల చేస్తూ జీ.ఓ. ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం.

ఇది కేవలం రవాణా ఖర్చులకు మాత్రమే. మిగిలిన ఖర్చులు కూడా చాలా ఉండబోతున్నాయి. అయితే ఇప్పుడు ఇది వివాదాస్పదంగా మారింది. ప్రభుత్వ సొమ్ముతో ఉద్యమాలు చెయ్యడం ఏంటి అంటూ విమర్శలు చేస్తున్నాయి ప్రతిపక్ష పార్టీలు. కొందరు మాత్రం ఇందులో తప్పు లేదు అంటున్నారు. ఇది ఒక రాజకీయ పార్టీ చేస్తున్న ఉద్యమం కాదని రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రజా పోరాటం కాబట్టి ప్రభుత్వ నిధులు ఖర్చు పెట్టడం తప్పు కాదని. రాష్ట్ర ప్రయోజనాల కోసం మన సొమ్ము వాడటం కూడా మన అందరి బాధ్యత అని వారి వాదన.

ఎటువైపు ఉన్నారు అనేదాని బట్టి ఈ వాదన మారుతూ ఉంటుంది. ఢిల్లీలోని ఆంధ్ర భవన్ లో ఈ దీక్ష ప్లాన్ చేశారు. మిగిలిన ప్రదేశాలలో చేస్తే కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ పోలీసుల ద్వారా ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉంది కాబట్టి ఆంధ్ర భవన్ లో చేస్తేనే మేలు అని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 10న బీజేపీ ఆధ్వర్యంలో గుంటూరులో భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఆ మరునాడు ఈ దీక్ష జరగడం విశేషం.