Nara-Lokesh Former Minister TDPగత సార్వత్రిక ఎన్నికలలో మంగళగిరిలో ఓటమి చవిచూసి చేదు అనుభవాన్ని చవిచూసిన నారా లోకేష్, ఆ తదుపరి కొంత విరామం తీసుకున్నారు. శారీరకంగా ఎవరూ ఎలాంటి కామెంట్ చేయడానికి ఆస్కారం లేకుండా పూర్తి ఫిట్ నెస్ ను సొంతం చేసుకున్న లోకేష్, గతంలో తన ప్రసంగాలలో దొర్లిన తప్పులను సవరించుకుని తిరిగి రంగంలోకి దిగారు.

ఎప్పుడైతే మళ్ళీ ప్రజలలో తిరుగుతూ అధికార పార్టీ తీరును ఎండకడుతూ సాగుతున్నారో, అప్పటి నుండి లోకేష్ లో రాజకీయ పరిణితి మరింత ఎక్కువ అయినట్లుగా కనపడుతోంది. ప్రజలను ఆకర్షించే విధంగా ప్రసంగాలు మొత్తం పంచ్ లు, ప్రాసలు, ఛలోక్తులతో నింపుతున్న లోకేష్, ఇటీవల ప్రెస్ మీట్ ల సందర్భాలలో సాక్షి మీడియా గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు.

గడిచిన మూడు వారాలలో ఏకంగా మూడు సార్లు ‘సాక్షి’ని ప్రత్యేకంగా అడిగి తెలుసుకుని మాట్లాడుతున్నారంటే, లోకేష్ ఆత్మ విశ్వాసం ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ‘ఏంటమ్మా మొన్న మన ప్రెస్ మీట్ కు రాలేదేంటి’ అంటూ తొలుత ‘సాక్షి’ని ఉద్దేశించి మాట్లాడిన వైనం సోషల్ మీడియా అటెన్షన్ ను రాబట్టింది.

అలాగే మొన్న వారంలో ‘సాక్షి’ మీడియా ప్రతినిధి ఎక్కడా? అంటూ సాక్షి మైక్ ను పట్టుకుని అడిగి, ‘ఏంటి జీతాలు పెంచలేదంట’ అంటూ ఛలోక్తులు విసిరారు. ఈ సందర్భంగా వెనుక ఉన్న అచ్చెన్నాయుడు వంటి సీనియర్ నేతలు కూడా నవ్వు ఆపుకోకుండా ఉండలేకపోయారు. ఈ క్రమంలో తాజాగా మరోసారి ‘సాక్షి’ని ఉద్దేశించి ప్రత్యేకంగా ప్రస్తావించారు లోకేష్.

కల్తీ సారా తాగి 26 మంది చనిపోయిన వైనంపై స్పందించిన నారా లోకేష్, ప్రెస్ మీట్ ముగిసిన తర్వాత ‘సాక్షి’ని ప్రస్తావిస్తూ, ‘ఏం సాక్షి, ఎనీ క్వశ్చన్స్?’ అంటూ ప్రత్యేకంగా అడుగగా, సదరు మీడియా ప్రతినిధి ఎలాంటి ప్రశ్నలను వేయలేదు. ఓ పక్కన సీఎం జగన్ తన సొంత మీడియా అయిన సాక్షిలో తప్ప మరొక మీడియా ముందుకు రావడానికి సాహాసించని చేయలేని తరుణంలో, లోకేష్ ఏమో ఏకంగా సాక్షిని ఎదురు ప్రశ్నలు వేస్తున్న వైనం ఇద్దరి నేతలలోని వ్యత్యాసాన్ని చాటి చెప్తోంది.

ఇదే ఇపుడు సోషల్ మీడియాలో హైలైట్ అవుతోంది. ముఖ్యంగా టీడీపీ సోషల్ మీడియా వింగ్ ఈ అంశాన్ని స్పృశిస్తూ వైరల్ చేస్తోంది. గడిచిన మూడేళ్ళుగా జగన్ వ్యతిరేక ఛానల్స్ గా ముద్రపడిన ఏబీఎన్, టీవీ5లు ఉంటే వెళ్ళిపోమని చెప్పే వైసీపీ నేతల తీరుకు, తమ వ్యతిరేక మీడియాను పిలిచి మరీ ప్రశ్నలు అడిగే లోకేష్ తీరుకు… వచ్చే ఎన్నికలకు ఎవరెలా సిద్ధమయ్యారో చెప్పకనే చెప్తున్నారన్న ప్రచారం ముమ్మరంగా సాగుతోంది.