Andhra Pradesh Formation Dayనేడు ఆంధ్రప్రదేశ్‌ అవతరణదినోత్సవం… ఎవరికీ తెలియకుండానే జరిగిపోయింది. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవం అంటే రాష్ట్రమంతటా పండుగ వాతావరణం వెల్లివిరిసేది. నవంబర్‌ 1న రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా ఓపక్క ప్రభుత్వంలో మంత్రులు, అధికారులు, రాజకీయ నేతల హడావుడి, మరోపక్క ప్రభుత్వ కార్యాలయాలలో, పాఠశాలలో పండుగ వాతావరణం నెలకొని ఉండేది. కానీ 2014, జూన్ 2న మళ్ళీ రాష్ట్ర విభజన జరిగి ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పుడు తొలిసారిగా ప్రజలలో రాష్ట్రావతరణ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకోవాలనే అయోమయం ఏర్పడింది.

జూన్ 2నే జరుపుకోవాలని కొందరు, కాదు… ఎప్పటిలాగే నవంబర్‌ 1న జరుపుకోవాలని మరికొందరు వాదిస్తుండేవారు. అయితే రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్‌ తీవ్రంగా నష్టపోయి మళ్ళీ మొదటి నుంచి పునర్నిర్మించుకోవలసిన పరిస్థితులు నెలకొని ఉన్నందున అప్పుడు అధికారంలో ఉన్న టిడిపి ప్రభుత్వం రాష్ట్ర అవతరణ దినోత్సవం బదులు నవనిర్మాణ దినోత్సవాల పేరుతో వారం రోజులు వేడుకలు నిర్వహించడం ప్రారంభించింది. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ నవంబర్‌ 1వ తేదీన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ దినోత్సవం నిర్వహించడం ప్రారంభించింది.

రాజధాని విషయంలోనే కాదు… రాష్ట్ర అవతరణ దినోత్సవం విషయంలోనూ ఇంత అయోమయం నెలకొని ఉండటం చాలా శోచనీయం. అందుకే ఒకప్పుడు ఎంతో అట్టహాసంగా పండుగ వాతావరణంలో జరుపుకొనే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఇప్పుడు ప్రజలు కూడా మరిచిపోయారు. అది ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్ళిపోయిందో కూడా తెలీని పరిస్థితి నెలకొని ఉండటం చాలా బాధాకరం.

జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, “అనాడూ మనలో నిండి ఉన్న ఆ పోరాట స్పూర్తి, ఉత్తేజం ఏమైపోయాయి ఇప్పుడు? రాష్ట్రానికి ఇంత నష్టం జరుగుతున్నా ఎవరూ నోరెత్తి ప్రశ్నించడానికి ఎందుకు భయపడుతున్నారు?” అని ప్రశ్నించారు. దానికి సమాధానం ఆయనకే బాగా తెలుసు.

ఇప్పుడు రాష్ట్రంలో ప్రజలందరూ పార్టీలవారీగా, కులాలవారీగా, మూడు రాజధానుల పుణ్యమాని ప్రాంతాల వారీగా కూడా చీలిపోయున్నారు. ప్రభుత్వ నిర్ణయాలు తప్పనిభావిస్తున్నా, వాటితో ఏకీభవించకపోయినా మౌనంగా ఉండిపోక తప్పని పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి. ప్రభుత్వ అభిప్రాయాలే ప్రజాభిప్రాయలుగా మారిపోతున్నాయి. తమ అభిప్రాయాలను గొంతెత్తి మాట్లాడే భావప్రకటన స్వేచ్చను ప్రజలు ఎప్పుడో కోల్పోయారు. అందుకే ప్రజలలో కూడా రాష్ట్రం ఏమైపోతున్నా ఓ రకమైన నిర్లిప్తత ఏర్పడింది. ఈ దాస్య శృంఖలాలను తెంచిపడేసి మళ్ళీ స్వేచ్చా ప్రసాదించేవారి కోసం ప్రజలు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఆ బాధ్యత ఎవరు తీసుకొంటారో… ఆ శుభదినం ఎప్పుడు వస్తుందో… చూడాలి!