Nara Chandrababu Naiduగత ఎన్నికలలో వైసీపీ కొట్టిన చావుదెబ్బతో డీలాపడిపోయిన తెలుగుదేశం పార్టీ, రెండున్నర్రేళ్ళ తర్వాత ఇప్పుడిప్పుడే కాస్త పుంజుకుంటోంది. రెండేళ్ల పాటు అధికార పార్టీ వైఫల్యాలను పరిశీలించిన టిడిపి, ఇపుడు వాటిని ఎండకడుతూ ప్రజల్లోకి వెళ్తోంది. ఈ తరుణంలో పార్టీని, నాయకులను, కార్యకర్తలను సరైన దిశలో నడిపించాల్సిన బాధ్యత పార్టీ లీడర్ గా చంద్రబాబుపై ఉంది.

ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ కేంద్రంగా జరుగుతున్న రాజకీయ విమర్శలను తిప్పికొట్టడంలో సరైన వ్యూహం రచించుకోలేకపోతే, పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రత్యర్థి వైసీపీ విమర్శలను పక్కన పెడితే, సొంత పార్టీ నేతల విమర్శలు చంద్రబాబుకు తలనొప్పిగా మారనున్నాయి.

వర్ల రామయ్య వంటి నేతలు జూనియర్ ఎన్టీఆర్ పై చేసే కామెంట్స్ ను అదుపులో పెట్టాల్సిన ఆవశ్యకత పార్టీ అధినేతగా చంద్రబాబుకు అనివార్యంగా మారుతోంది. అసలు ఏ వ్యూహంలో భాగంగా వర్ల, బుద్ధా వెంకన్న అండ్ కో జూనియర్ ఎన్టీఆర్ పై ఈ వ్యాఖ్యలు చేస్తున్నారో పార్టీ నేతలకే అర్ధం కాని పరిస్థితి నెలకొంది.

గతంలో అధికారంలో ఉన్నపుడు కూడా ఇలాగే మౌనం వహించి, పార్టీకి పరోక్షంగా నష్టం వాటిల్లేలా చేయడంలో చంద్రబాబు తన వంతు పాత్ర పోషించారు. ఇప్పుడు కూడా మౌనం వహిస్తే, రానున్న రోజుల్లో క్రియాశీలక రాజకీయాలలో అది తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుందన్న హెచ్చరికలు రాజకీయ పరిశీలకుల నుండి వ్యక్తమవుతున్నాయి.

ప్రస్తుతం పార్టీ ఉన్న స్థితిలో జగన్ ను ఢీ కొట్టాలంటే, అందరినీ కలుపుకుపోవడం ఒక్కటే చంద్రబాబుకున్న మార్గం. అలా కాకుండా ఇంకా గాలిలో మేడలు ఊహించుకుంటే మాత్రం, మునుపటి ఫలితాలు పునరావృతం అయ్యే అవకాశాలు స్పష్టంగా కనపడుతుందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వినపడుతోంది.

ముఖ్యంగా లోకేష్ కోసమే జూనియర్ ఎన్టీఆర్ ను పక్కన పెట్టారన్న టాక్ ఇప్పటికే ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. దీనిని తిప్పికొట్టడం కోసమైనా చంద్రబాబు పెదవి విప్పి, తమ సొంత పార్టీ నేతలకు క్లాస్ తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే… ఇదే పాయింట్ ను ప్రత్యర్థి పార్టీలు పట్టుకుని రాజకీయ లబ్ది పొందే అవకాశాలు సుస్పష్టం.