apcpsea-employeesఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వోద్యోగుల పరిస్థితి నానాటికీ దయనీయంగా మారుతోంది. గతంలో నెలాఖరునే జీతాలు బ్యాంక్ ఖాతాలలో పడిపోతుండేవి కనుక వాటి గురించి ఎవరుఎదురుచూపులు చూడవలసిన అవసరం ఉండేది కాదు. కానీ మన సంక్షేమ రాజ్యంలో 5వ తేదీ వస్తున్నా… రేపు దసరా పండుగఉన్నా ఇంతవరకు 50 శాతం మందికి పైగా జీతాలు పడనేలేదు. దీంతో ఉద్యోగులు జీతాలు ఎప్పుడు పడతాయా.. అని ఎదురుచూస్తున్నారు. జీతాలు పడినట్లు మొబైల్ ఫోన్‌లో మెసేజ్ వచ్చిందా లేదా? అని మాటి మాటికి చూసుకొంటున్నారు.

“మన రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బ్రహ్మాండంగా ఉంది. అభివృద్ధి రేటు ఇంకా బ్రహ్మాండంగా ఉంది. దేశానికే మన రాష్ట్రం ఆదర్శప్రాయం…’ అంటూ సాక్షాత్ సిఎం జగన్మోహన్ రెడ్డి, ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ శాసనసభలో సగర్వంగా చెప్పుకొన్నారు. కానీ టిడిపి నేతలు, చంద్రబాబు నాయుడు, వారి మీడియా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోలేదని, శ్రీలంకలా దివాళా తీస్తుందంటూ తాం ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఒకవేళ వారు చెప్పిందే నిజమనుకొంటే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ప్రతీనెల 1వ తేదీలోగా జీతాలు ఎందుకు చెల్లించలేకపోతోంది?జీతాల చెల్లింపు ప్రక్రియకు ఇంత సమయం ఎందుకు తీసుకొంటోంది? రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి గురించి ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందంటూ నిప్పులు చెరిగినప్పుడు వారికి ఆ అవకాశం ఇవ్వకుండా ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించవచ్చు కదా? ప్రభుత్వాన్ని ఎవరు అడ్డుకొన్నారు? రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించకపోవడానికి కూడా టిడిపి, ఎల్లో మీడియాయే కారణమని ఆరోపిస్తారా? మంత్రులు దీనిని తమ ప్రభుత్వ వైఫల్యమని చెప్పుకొంటారా లేక తమ ప్రభుత్వం సమర్దతకు నిదర్శమని చెప్పుకొంటారా?

రాష్ట్ర విభజన తర్వాత చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితులలో కూడా గత ప్రభుత్వం ప్రభుత్వోద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లిస్తూండేది. అంతేకాదు… హైదరాబాద్‌లో స్థిరపడిన ఉద్యోగులు రోజూ అక్కడి నుంచి అమరావతికి వచ్చి డ్యూటీ చేసి వెళ్ళేందుకు రైళ్ళు, బస్సులు కూడా ఏర్పాటు చేసింది. అమరావతిలో ఉండేందుకు సిద్దపడిన ఉద్యోగుల కోసం తాత్కాలిక వసతి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసింది. ఆనాటికంటే ఇప్పుడు పరిస్థితులు చాలా మెరుగుపడ్డాయి. అయినా జగన్ ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు చెల్లించలేకపోతోంది ఎందుకు? ఐ‌టి, అనేక ప్రైవేట్ కంపెనీలు తమ ఉద్యోగులకు, కార్మికులకు నెలాఖరునే జీతాలు జమా చేస్తున్నాయి. కానీ సర్వశక్తివంతమైన రాష్ట్ర ప్రభుత్వం జీతాలు చెల్లించలేకపోతోంది?ఎడాపెడా అప్పులుచేస్తున్నా ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించలేకపోతోంది. ఇది ప్రభుత్వానికి గర్వకారణమా?దీనికి వైసీపీ మంత్రుల సంజాయిషీ ఏమి చెప్తారు? ఎవరిని నిందిస్తారు?