Andhra-Pradesh-employeesవైసీపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అవుట్ సోర్సింగ్‌ సిబ్బందికి జీతాలు చెల్లించడం గురించి చెప్పినవన్నీ అబద్దాలే అని ఉద్యోగ సంఘాల నేతలు ఈరోజు బయటపెట్టడం విశేషం.

ఏపీ ఎన్‌జీవోల సంఘం నేత బండి శ్రీనివాసరావు, సంఘంలోని ఇతర నేతలతో కలిసి శుక్రవారం విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించారు. దానిలో ఆయన మాట్లాడుతూ, అవుట్ సోర్సింగ్‌ సిబ్బందికి కూడా ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులతో కలిపి ఒకేసారి జీతాలు చెల్లించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుండటం వలననే తమ జీతాల చెల్లింపు ఆలస్యం అవుతోందన్న మాట వాస్తవం కాదన్నారు. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్‌ ఉద్యోగులకి ప్రభుత్వం జీతాలు బకాయి పెడుతోందన్నారు. ప్రభుత్యోద్యోగులమైన తామే నెలనెలా జీతాలు ఆలస్యమవుతుంటే తీవ ఇబ్బందులు పడుతున్నామని, ఇక కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్‌ ఉద్యోగులకు జీతాలు బకాయిలు పెడుతుంటే వారు ఎలా బ్రతుకుతారని ప్రశ్నించారు.

తామంతా నెలరోజులు పనిచేసినందుకు 30వ తేదీన జీతాలు చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందన్నారు. కానీ కొన్ని నెలలుగా ప్రతీ నెల 10,12,15 తేదీల వరకు కూడా జీతాలు వేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతీనెలా ఇదే తంతు పునరావృతం అవుతుండటంతో తాము పాలు, కూరగాయలు అమ్మేవాళ్ళకి కూడా లోకువైపోయామని బండి శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. సకాలంలో జీతాలు రాకపోవడం చేత బ్యాంకులకి ఈఎంఐలు చెల్లించలేక జరిమానాలు చెల్లించుకోవలసి వస్తోందని, దీంతో బ్యాంకులు కొత్తగా లోన్లు ఇవ్వడం మానేశాయన్నారు.

ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంతో లాలూచీ పడ్డాయని వస్తున్న వార్తలపై కూడా బండి శ్రీనివాసరావు స్పందించారు. “ఇంతవరకు ఏ ఉద్యోగ సంఘమూ ప్రభుత్వంతో లాలూచీ పడలేదు… ఇక ముందు పడబోదు కూడా. ఉద్యోగుల ఉద్యమాలని ఎన్నడూ ప్రభుత్వానికి తాకట్టుపెట్టలేదు… పెట్టదు కూడా! మాకు మా ఉద్యోగులు, ఉపాధ్యాయుల ప్రయోజనాలే ముఖ్యం. వాటిని కాపాడేందుకు ప్రభుత్వంతో పోరాడుతూనే ఉంటాము. కనుక ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఇటువంటి అనుమానాలు, అపోహలు పెట్టుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాము,” అని అన్నారు.

ఉద్యోగుల జీపీఎఫ్ నిధులను ఉద్యోగులకి ఇవ్వకుండా ప్రభుత్వం వాడుకోవటాన్ని బండి శ్రీనివాసరావు తీవ్రంగా తప్పు పట్టారు. ఇటువంటివి గతంలో ఎన్నడూ చూడలేదన్నారు. రాష్ట్రంలో సుమారు 60 లక్షల మందికి సామాజిక పింఛన్లు ఒకటో తేదీన చెల్లిస్తున్న ప్రభుత్వం 30 రోజులు పనిచేసిన తమకు, పదవీ విరమణ చేసిన పెన్షనర్లకు 1వ తేదీన జీతాలు ఎందుకు చెల్లించడంలేదని ప్రశ్నించారు. ముందుగా ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్‌ ఉద్యోగులకి, పెన్షనర్లకి ప్రభుత్వం నెలనెలా జీతాలు, పెన్షన్లు చెల్లించిన తర్వాత ఎవరికైనా చెల్లించుకోవచ్చునని సూచించారు. జీతాల చెల్లింపులో ఆలస్యం ఎప్పటికీ ఇలాగే కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లయితే తాము కార్యాచరణ ప్రకటించాల్సి వస్తుందని బండి శ్రీనివాసరావు హెచ్చరించారు.