ysrcp-ys-jagan-bjp-allianceఎలక్షన్ కమిషన్ ఎన్నికల నగారా మొయించక మునుపే ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల హంగామా అప్పుడే దర్శనమిస్తోంది. ఒకరికి మించి మరొకరు ఎత్తుకు పై ఎత్తులు వేయడంలో వ్యూహాలు రచించుకుంటున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ టాప్ లో ఉండగా, టిడిపిని గద్దె దించి ఎలాగైనా ముఖ్యమంత్రి పీఠం దక్కించుకోవాలని గత నాలుగేళ్ళుగా జగన్ తాపత్రయపడుతున్నారు. ఎన్నికల సమయం దగ్గరికి రావడంతో అది కాస్త పతాక స్థాయికి చేరుకుంది.

ముఖ్యమంత్రి చంద్రబాబు అయినా, జగన్ అయినా, ఇంకెవరైనా… రాష్ట్రానికి మంచి జరిగితే చాలు… తనకు ఎలాంటి పదవులు అవసరం లేదంటూ పవన్ కదుపుతున్న వ్యూహాలు ప్రస్తుతం అంతుచిక్కని విధంగా ఉంటున్నాయి. సరిగ్గా పవన్ మనసులో ఏమనుకుంటున్నారో ఆయనకైనా స్పష్టత ఉందో లేదో తెలియదు గానీ, రాజకీయంగా ఎన్నికల తర్వాత పవన్ ఎలా ఉంటారు? ఏ స్థాయిలో ఉంటారు? అసలు ఉంటారా? ఉండరా? అన్నది మాత్రం అత్యంత ఆసక్తికరంగా మారింది. పవన్ రాజకీయ కెరీర్ ఎలా ఉన్నా, రాబోయే ఎన్నికలలో ‘కింగ్ మేకర్’ అయ్యే సంకేతాలు ఎక్కువగా కనపడుతున్నాయనేది విశ్లేషకుల మాట.

“అవిశ్వాసం” కేంద్రంగా ఏపీలో చంద్రబాబు – పవన్ కళ్యాణ్ – జగన్ ల నడుమ రాజుకున్న రాజకీయ వేడి ఇప్పట్లో తగ్గేలా లేదు. బహుశా పార్లమెంట్ సమావేశాల సమయం చేరుకునే సరికి ఇది పతాక స్థాయికి చేరుకునేలా కనపడుతోంది. ఈ రాబోయే కొన్ని నెలలు మూడు పార్టీలకు అత్యంత కీలకం కానున్నాయి. ముఖ్యంగా ‘ప్రత్యేక హోదా’ అనేది 2019 సార్వత్రిక ఎన్నికలకు ప్రధాన ఎజెండా. అందుకే స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ‘స్పెషల్ స్టేటస్’పై తాజాగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు.

అన్ని రాష్ట్రాలకు ‘ప్రత్యేక హోదా’ ముగిసిపోతుందని కేంద్రం చెప్పడంతోనే తాము ప్యాకేజ్ కు అంగీకరించామని, అలా కాకుండా ఇతర రాష్ట్రాల గడువును మరో పదేళ్ళు పెంచేటట్లయితే ఏపీకి దక్కాల్సిన ‘స్పెషల్ స్టేటస్’ను కేంద్రం ఇచ్చి తీరాలని, ఇది ప్రజల డిమాండ్ అంటూ బాబు చెప్పడంతో… తదుపరి ఎలక్షన్స్ కు సెంటర్ పాయింట్ ‘స్పెషల్ స్టేటస్’ అన్నది ఖరారయ్యింది. దీనిపై ఈ ముగ్గురు నేతలు తీసుకునే నిర్ణయాలు, చేసుకునే ప్రచారం ఆధారంగానే ఓటింగ్ డివైడ్ కానుంది. దేశంలో ఎక్కడా లేనంతగా ఏపీ రాజకీయాలు అత్యంత ఆసక్తిని కలిగిస్తున్నాయని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.