TDPవైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అప్పుడే 4 సంవత్సరాలు కావస్తోంది. ఈ నాలుగేళ్ళలో జరిగిన కొన్ని స్థానిక సంస్థలు, ఉప ఎన్నికలలో వైసీపీయే విజయం సాధిస్తూ వస్తోంది. కనుక ప్రజలందరూ తమవైపే ఉన్నారంటూ వైసీపీ నేతలు గొప్పలు చెప్పకోంటోంది. అయితే కొత్తగా అధికారంలోకి వచ్చిన ఏ పార్టీకైనా కొంత ‘హనీమూన్ పీరియడ్’ ఉంటుందని అందరికీ తెలిసిందే.

సిఎం జగన్మోహన్ రెడ్డి పట్ల ప్రజలలో ఉన్న అంచనాల వల్ల కావచ్చు లేదా ఆయన విధానాలను అర్ధం చేసుకోకుండా తప్పుడు అభిప్రాయం ఏర్పరచుకోకూడదనే ప్రజల విజ్ఞత కావచ్చు లేదా కొన్నిఎన్నికలలో సానుభూతి ఓట్ల వలన కావచ్చు… లేదా అధికార దుర్వినియోగం చేసినందున వలన కావచ్చు… ఈ నాలుగేళ్ళలో జరిగిన ఎన్నికలలో వైసీపీ గెలుస్తోందనేది ఎవరూ కదనలేని నిజం. బహుశః అందుకే సిఎం జగన్మోహన్ రెడ్డికి 175 సీట్లు మనవేననే ధీమా ఏర్పడిందేమో?

ప్రజల నాడి తెలుసుకొనేందుకు సొంత సర్వేలు చేయించుకొన్నప్పుడైనా కాస్త నిజాయితీగా చేయించుకొని ఉండి ఉంటే బాగుండేది. కొన్ని మీడియా సంస్థలు టిడిపికి ప్రజాధారణ పెరుగుతోందని ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టిడిపి లాభపడవచ్చని సూచిస్తే, అవన్నీ ఫేక్ సర్వేలు, టిడిపి అనుకూల మీడియా చేత వ్రాయించుకొన్నవి అంటూ మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు ఎద్దేవా చేసేవారు.

వైసీపీలో అందరూ తమ అధినేత కళ్ళతో చూస్తూ, ఆయన చెవులతో వింటూ ఆయన కోరుకొన్నవే మాట్లాడేరు తప్ప ఎవరూ పిల్లి మెడలో గంట కట్టాలనుకోలేదు. మనమే 175 సీట్లు గెలుస్తామని సిఎం జగన్మోహన్ రెడ్డే వారిని భ్రమలలో ఉంచారా లేక క్షేత్రస్థాయిలో ఉండే వారికి రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మారుతోందని గ్రహించినా తమ అధినేత మెప్పుకోసం, పదవుల కోసం ఆయనను భ్రమలలో ఉంచారా?అనే సందేహం కలుగుతుంది.

మూడు పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానాలను టిడిపి భారీ మెజార్టీతో గెలుచుకోవడంతో వైసీపీలో అందరికీ ఆ భ్రమలు తొలగిపోయే ఉండాలి. కానీ ఇంకా కళ్ళకు గంతలు కట్టుకొని ఉండాలనుకొంటే ఎవరికీ అభ్యంతరం ఉండదు. దాదాపు నాలుగేళ్ళ వైసీపీ పాలన రుచి చూసిన తర్వాత జరిగిన ఎన్నికలు ఇవి. కనుక వైసీపీ పాలనపై ప్రజా తీర్పుగానే భావించవచ్చు. ఈ ఎన్నికలను మూడు రాజధానుల ప్రతిపాదనపై రిఫరెండంగా భావించి అటు రాయలసీమ, ఇటు ఉత్తరాంద్ర ప్రజలు తిరస్కరించారని స్పష్టమైంది.

ఉగాదికి ‘ఎవరి పంచాంగం వారిదే’ అన్నట్లు ఇంతకాలం ఎవరికి వారు సర్వేలు చేయించుకొని అంతా మనవైపే ఉన్నారని గొప్పగా చెప్పుకొని ఉండవచ్చు. కానీ నాలుగేళ్ళ వైసీపీ పాలన రుచి చూసిన తర్వాత, సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందు జరిగిన ఈ ఎన్నికలు సెమీ ఫైనల్స్ వంటివి. కనుక ఇవే అసలు సిసలైన సర్వేలు, ఈ ఫలితాలని భావించవచ్చు.

ఎందుకంటే వైసీపీకి తిరుగేలేదు… కుప్పంతో సహా 175 సీట్లు మనవే అని చెప్పుకొని మురిసిపోతున్న వైసీపీ నేతలకు వారి అధినేతకు ఉత్తరాంద్ర, రాయలసీమ ముఖ్యంగా కడప పులివెందుల కర్నూలు ప్రజలు ఇచ్చిన ఈ తీర్పు చెంపదెబ్బ వంటిదే కదా? దీనీ వారు ‘చెంప దెబ్బ’గా స్వీకరించడానికి మనసు అంగీకరించకపోయినా కనీసం కనువిప్పుగానైనా గ్రహిస్తే వారికే మంచిది.

కానీ వైసీపీ ప్రభుత్వానికి శల్యసారధ్యం చేస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి చెపుతున్నట్లు ‘వైసీపీకి పడిన ఓట్లను టిడిపి ఖాతాలో కలిపేయడం వలనే ఓడిపోయామని’ నమ్మితే చివరికి వారే నష్టపోతారు.

కళ్ళు లేక దృతరాష్ట్రుడు, కళ్ళుండి లోకాన్ని చూడకూడనుకొన్న గాంధారి, అహంభావంతో దుర్యోధనుడు, సకల అస్త్ర శస్త్రాలు చేతిలో ఉన్నప్పటికీ కర్ణుడు, శల్య సారధ్యంతో శల్యరాజు కలిసి చివరికి ఏం సాధించారో అందరికీ తెలుసు. జరుగబోయే కురుక్షేత్ర మహాసంగ్రామంలో మళ్ళీ అదే పునరావృతం కావచ్చని కేవలం తాజా ఫలితాలు సూచిస్తున్నాయి.