Botsa_Satyanarayana_YCPఅమ్మఒడి పధకంలో నుంచి ఈ ఏడాది ఏకంగా 1.29 లక్షల మందిని తప్పించినట్లు మీడియాలో వచ్చిన వార్తలపై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందిస్తూ, “అమ్మఒడి పధకం దేనికి ప్రవేశపెట్టాము? పిల్లలందరినీ బడులకు పంపిస్తారని, వారిని బాల్యంలోనే కూలిపనులకి పంపించకుండా వారికి చదువుకొనే అవకాశం కల్పిస్తారనే కదా? తల్లితండ్రులు తమ పిల్లలని బడులకి పంపించకపోవడం వలన వారి హాజరు శాతం తగ్గిపోయింది. విద్యార్దులకు 75 శాతం హాజరు ఉంటేనే అమ్మఒడి పధకం ఇస్తామని మేము ముందే చెప్పాము కదా?మరి ప్రభుత్వాన్ని తప్పు పడితే ఎలా?

నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో విద్యావ్యవస్థను మెరుగుపరుస్తున్నాం. అవసరమైతే ఉపాధ్యాయులకు కూడా శిక్షణ ఇప్పిస్తున్నాం. విద్యావ్యవస్థను బలోపేతం చేసి విద్యార్దులకు చక్కగా చదువుకొనేందుకు అవకాశాలు కల్పిస్తుంటే, కొందరు పనిగట్టుకొని ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈసారి ఇంటర్ ఫలితాలు తక్కువేమీ రాలేదు. 2019 కంటే మంచి ఫలితాలే వచ్చాయి,” అని అన్నారు.

పదో తరగతిలో కేవలం 67 శాతం ఉత్తీర్ణత వస్తే దానికి కరోనా కారణమని మంత్రి బొత్స సత్యనారాయణ వాదించారు. కరోనా కారణంగా విద్యార్దుల చదువులు దెబ్బ తిన్నాయని, తరగతులకు హాజరుకాలేకపోయారని దాంతో పరీక్షలలో తడబడ్డారని అన్నారు. కానీ ఇప్పుడు అమ్మఒడి పధకం లబ్దిదారులను తగ్గించినప్పుడు మంత్రి బొత్స సత్యనారాయణవారికి ఆ కరోనా సమస్యలేవీ గుర్తుకు రాకపోవడం విచిత్రమే కదా?

కరోనా రాకపోయుంటే పాఠశాలలు పూర్తిస్థాయిలో నడిచేవి. విద్యార్దులందరూ హాజరయ్యేవారు. పరీక్షలలో ఫలితాలు ఇంతకంటే మెరుగుగా వచ్చి ఉండేవి. కానీ అలా జరగలేదు. కనుక అమ్మఒడి పధకంలో లబ్దిదారులపై అనర్హత వేటు వేసే ముందు ప్రభుత్వం ఇవన్నీ ఆలోచించి ఉండాలి కదా? అన్నీ సవ్యంగా ఉంటే తల్లితండ్రులు తమ పిల్లలను బడికి పంపకుండా ఇంట్లో కూర్చొబెట్టుకోరు కదా?

తమది చాలా మానవీయమైన ప్రభుత్వమని, సిఎం జగన్మోహన్ రెడ్డి గొప్ప మానవతావాది అని వైసీపీ నేతలు గొప్పగా చెప్పుకొంటున్నప్పుడు, ఈ ఒక్క ఏడాది కరోనా సమస్యలను దృష్టిలో ఉంచుకొని అమ్మఒడి ఆంక్షలు సడలించి అర్హులైన అందరికీ సొమ్ము చెల్లించవచ్చు కదా?

అమ్మఒడి ఆర్ధికభారం తగ్గించుకొనేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అర్దమవుతూనే ఉంది. కనుక తల్లితండ్రులు పిల్లలను బడులకు పంపకపోవడం వలననే అమ్మఒడికి దూరం అయ్యారని మంత్రి బొత్స సత్యనారాయణ సెలవిస్తున్నారు. గ్రేట్!