LV Subramanyamరెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కే చంద్రశేఖరరావులు సంప్రదింపుల ద్వారా రెండు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యలు పరిష్కరించుకోవాలని నిర్ణయించుకున్నారు. జగన్ అధికారంలోకి వచ్చి నెల అయ్యిందో లేదో ఇప్పటికే ఆరు సార్లు కలిశారు ఇద్దరూ. ఇప్పుడు మొట్టమొదటి అధికారిక సమావేశంలో పాల్గొంటున్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులతో పాటు మంత్రులు, ఇరు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు, ఇతర ముఖ్య అధికారులు కూడా పాల్గొన్నారు.

ఈ భేటీ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం తెలంగాణ ముఖ్యమంత్రిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు మీడియాలో ప్రముఖంగా వచ్చాయి. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతున్నాయి. “మీరు తండ్రిలాంటి వారు. మా గురించి (ఆంధ్రప్రదేశ్) చెప్పడం చాలా సంతోషం. భేషజాలు లేవన్న మీరు హృదయపూర్వకంగా మాట్లాడి రెండు రాష్ట్రాలకు దశ, దిశ చూపారు. కుటుంబపెద్దగా వాత్సల్యంతో పరిష్కారం చూపిస్తున్నారు. విధేయులమై పనిచేస్తామని హామీ ఇస్తున్నా,” అని ఎల్వీ చెప్పుకొచ్చారు.

కేసీఆర్ మీద అమితమైన ప్రేమ గౌరవం చూపిస్తున్న చీఫ్ సెక్రటరీ గారికి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుని ఛార్జ్ తీసుకున్నా పక్షం రోజులకు కూడా మర్యాదపూర్వకంగా కలవాలని తెలియకపోవడం విచారమని సోషల్ మీడియాలో ఎద్దేవా చేస్తున్నారు. ఎన్నికల సమయంలో అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా పని చేసి ఇప్పుడు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి విధేయులమై పనిచేస్తామని హామీ ఇస్తున్నా అనడం ఎంతవరకూ సబబు అని వారు ప్రశ్నిస్తున్నారు.