Corona Effect: Tirumala Closed for Pilgrims Indefinitelyదేశవ్యాప్తంగా ప్రార్ధనాలయాలు ఓపెన్ అయ్యి నెల రోజులు కూడా కాలేదు. ఇప్పటికే కొన్ని దేవాలయాల వల్ల కేసులు పెరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. చిత్తూరు జిల్లాలో ని తిరుపతి, శ్రీకాళహస్తి వంటి సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ప్రమాదకర పరిస్థితులు నెలకొంటున్నాయని సమాచారం. తిరుపతిలో మొత్తం 183 కేసులు వెలుగు చూశాయి.

శ్రీకాళహస్తిలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 130కి చేరుకుంది. ఆయా పట్టణాల స్థాయి దృష్ట్యా రాష్ట్రంలోనే కాదు జాతీయ స్థాయిలో కూడా అత్యధికంగానే పరిగణించాలి. ముఖ్యంగా ఈ రెండు పట్టణాలకు తమిళనాడు నుండి ఎక్కువగా భక్తులు వస్తున్నారని వారి వల్ల కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని అధికారులు అంటున్నారు.

ఆయా భక్తులు దేవాలయాలను సందర్శించిన సమయంలో వైరస్ ను వ్యాప్తి చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా భక్తులు వచ్చే చోటు కావడంతో ఈ ప్రమాదం మిగతా జిల్లాలకు కూడా వ్యాపిస్తుంది. నిన్నటి బులెటిన్ ప్రకారం చిత్తూర్ జిల్లాలో ఇప్పటివరకు 562 కేసులు నమోదు అయ్యాయి. దాదాపు సగం కేసులు ఈ రెండు పట్టణాలలోనే నమోదు కావడం గమనార్ధం.

ఆంధ్రప్రదేశ్ లో రోజుకు సగటున 500 కేసులు నమోదు అవుతున్నాయి. టెస్టులు పెరిగిన కొద్దీ కేసులు కూడా అంతే స్థాయిలో పెరగడం ఆందోళనకరం. ఏపీలో కర్నూల్, కృష్ణా, గుంటూరు, అనంతపురం జిల్లాలో కేసులు ఎక్కువగా ఉన్నాయి. కనుచూపు మేరలో పరిస్థితులు సాధారణ స్థాయికి చేరుకునే అవకాశాలు కనిపించడం లేదు.