andhra pradesh congress changes its tone on TDPతెలంగాణలో టీడీపీ కాంగ్రెస్ కలిసి పని చెయ్యడం, ఇటీవలే చంద్రబాబు రాహుల్ గాంధీ చేతులు కలపడంతో ఏపీలో కూడా పొత్తు తప్పదు అనుకుంటున్నారో ఏమో ఏపీ కాంగ్రెస్ నేతలు కూడా తమ స్వరం మారుస్తున్నారు. నెమ్మదిగా టీడీపీకి అనుకూలంగా మాట్లాడుతున్నారు. ఇంతకాలం ఎపి కాంగ్రెస్ నేతలు టిడిపి,బిజెపిలు కలసి ఎపి ప్రజలను మోసం చేశాయని అనేవారు. కాని ఇప్పుడు పల్లవి మార్చారు. కేంద్రంలో బీజేపీతో నాలుగేళ్లు కలిసి ఉండి టీడీపీ మోసపోయిందని కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

బీజేపీ పూర్తిగా మోసగించే వరకూ టీడీపీ మేలుకోలేకపోవడం దురదృష్టకరమని కిరణ్‌చెప్పారు. అది మేలుకునేలోపు రాష్ట్రానికి జరగకూడని నష్టం జరిగిందన్నారు. విద్యాసంస్థల కోసం కేంద్రం రూ.11,700 కోట్లు ఇవ్వాల్సి ఉండగా.. అందులో రూ.640 కోట్లే విడుదల చేయడం అన్యాయం. దుగరాజపట్నం పోర్టు, కడప స్టీల్‌ ప్లాంటు, విశాఖ రైల్వే జోన్‌ విషయంలో బీజేపీ రాష్ట్రాన్ని దారుణంగా మోసగించిందని ఆయన అంటున్నారు. మరో నేత తులసి రెడ్డి కూడా టీవీ డిబేట్లలో టీడీపీకి అనుకూలంగా మాట్లాడుతున్నారు.

తెలంగాణలో మహాకూటమికి వచ్చిన ఫలితాలు బట్టి ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ కాంగ్రెస్ సంబంధాలు ఆధారపడి ఉంటాయి. ఒకవేళ అక్కడి ప్రజలు మహాకూటమిని తిరస్కరిస్తే ఏపీలో కాంగ్రెస్ పొత్తుపై చంద్రబాబు పునరాలోచించే అవకాశం ఉంది. డిసెంబర్ 7న తెలంగాణ ఎన్నికలు జరగబోతున్నాయి అదే నెల 11న ఫలితాలు విడుదల కాబోతున్నాయి. టీడీపీ తెలంగాణాలో కేవలం 13 స్థానాలలో పోటీ చేస్తుండగా కాంగ్రెస్ తొంభైకి పైగా స్థానాలలో పోటీ చేస్తుంది.