All Eyes on Jagan's Navaratnas, People's Expectations Highనిన్న ప్రమాణస్వీకారం చేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన మీద దృష్టి పెట్టారు. వివిధ శాఖల అధికారులతో సమీక్షలు జరపడంతో పాటు మంత్రివర్గ కూర్పుపై కూడా పని చేస్తున్నారు. జూన్‌ 8న కేబినెట్‌ విస్తరణ జరిగే అవకాశముందని సమాచారం. ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలకూ స్థానం కల్పించాలని యోచిస్తున్నారు. పాదయాత్ర, ఎన్నికల ప్రచారం సందర్భంలో కొందరు నేతలకు మంత్రులుగా అవకాశం కల్పిస్తానని ఇప్పటికే జగన్‌ హామీ ఇచ్చారు.

దాని బట్టి చూస్తే మంగళగిరి నుంచి విజయం సాధించిన ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, చిలకలూరిపేట టికెట్‌ను త్యాగం చేసిన మర్రి రాజశేఖర్‌రెడ్డికి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశముంది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేసి ఇప్పుడు ఉన్న జిల్లాలను 25కు పెంచాలని యోచించడంతో ప్రతీ జిల్లాకు ఒక మంత్రి ఉండేలా 25 మందితో మంత్రివర్గం ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తుంది. జగన్ పార్టీ పెట్టగానే పార్టీలో చేరి ఇప్పటివరకూ ఉన్న నేతలకు ప్రాధాన్యం ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.

రాజకీయ అవసరాలతో పాటు సుదీర్ఘ కాలంగా నమ్మకం ఉన్న వారితో కేబినెట్ సమతూకంగా ఉండాలని జగన్ యోచిస్తున్నట్టు సమాచారం. మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ లో నెంబర్ 2 గా ఉన్న విజయసాయి రెడ్డిని కేబినెట్ లోకి తీసుకుంటారని ప్రచారం జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవడానికి ఆయన రాజ్యసభలో ఉండటమే మేలని జగన్ భావిస్తున్నారని సమాచారం. జూన్‌ 15 లేదా ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మూడు రోజుల పాటు అసెంబ్లీ నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం.