YS-Jagan-Should-Start-Showing-His-Other-Sideకేంద్ర బడ్జెట్‌ లో రెండు తెలుగు రాష్ట్రాలకు దక్కింది ఏమీ లేదు. దీనిపై విమర్శలు వస్తున్న తరుణంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్నపెదవి విరిచారు. అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఈ విషయంలో వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. ఆ పార్టీ వారు ఒకరిద్దరు నామమాత్రంగా నిరాశ వ్యక్తం చేసినా జగన్ దాని మీద మౌనం వహించడం గమనార్హం. మరోపక్క నిధులు ఎలా వస్తాయో అనే ఆలోచన లేకుండా జగన్ తాయిలాలు ప్రకటిస్తూ పోతున్నారు.

అయితే జగన్ మౌనం పై విమర్శలు రావడంతో ఆయన మీడియాకు కొన్ని లీకులు ఇచ్చారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి ఏ మాత్రం న్యాయం చేయలేదని, ఏపీకి న్యాయం చేయాలని కేంద్రాన్ని మళ్లీ మళ్లీ కోరాలని.. పార్లమెంట్‌లోనూ ఇదే విధానంతో ముందుకెళ్లాలని జగన్ నేతలకు సూచించారట. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామని అధికారంలోకి వచ్చి ఇప్పుడు కనీసం మీడియా ముందుకు వచ్చి రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ఖండించలేని పరిస్థితికి వచ్చామా అని వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులే అనుకోవడం విశేషం.

గతంలో చంద్రబాబు కూడా ఇంతే కొన్ని కొన్ని విషయాల్లో మీడియా ముందుకు రాకుండా, లీకులు ఇచ్చే వారు. ప్రజలకు నిజంగానే ముఖ్యమంత్రి పలానా విషయం మీద స్పందించారు అని అనుకునేటట్టు. ఇప్పుడు జగన్ కూడా అదే పంథాలో వెళ్తున్నట్టు కనిపిస్తుంది. ఇది ఆయనకు గానీ పార్టీకి గానీ మంచిది కాదు. ఇదే వైఖరి ప్రదర్శిస్తున్నప్పుడు గతంలో చంద్రబాబు మీద తాము ఎటువంటి విమర్శలు చేశామో వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు గుర్తు తెచ్చుకుంటే తాము చేస్తుంది రైటో రాంగో తెలుస్తుంది.