YS-Jagan-Mohan-Reddy‘పగ సాధిస్తా’ పధకాలు పెట్టారు మాముఖ్యమంత్రి గారు, ప్రతి దానికి ‘పగ సాధిస్తా’ పధకంలో భాగంగా ఒక సామాజిక వర్గం మీద కులాల పగ సాధిస్తా అయిపోయింది. ఇక సినిమాపై పగ సాధిస్తా స్కీంలో భాగంగా తీసుకుంటున్న నిర్ణయాలు ముఖ్యమంత్రి గారికి తెలియకుండానే జరిగినట్లుగా తాను భావిస్తున్నానని ఆర్ఆర్ఆర్ అన్నారు.

ఎందుకంటే సిమెంట్ అమ్ముకునే వ్యక్తికి సినిమా గురించి తెలియదా? ఆయన సిమెంట్ ను నేనే తీసుకుని నేనే అమ్ముకుంటానంటే ఊరుకుంటాడా? కోర్టుకు వెళ్తాడుగా! ఒకవేళ జగన్ ఓ సాధారణ ఎమ్మెల్యే అయితే ఏ కొత్త ముఖ్యమంత్రో వచ్చి సిమెంట్ నేనే అమ్ముతా అంటే జగన్ మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్తారు కదా? ఇది ఊహాజనితమే అయినా ఇలాగే జరుగుతుంది కదా అంటూ ఆర్ఆర్ఆర్ అన్నారు.

ఇక సినిమాకు సంబంధించిన ఎఫ్.డీ.సిలో ఉన్న ఉద్యోగులకే జీతాలు ఇవ్వడం లేదని తెలిసిందని, నెట్ లో జీవోలు పెట్టడానికే వైసీపీ ప్రభుత్వానికి కష్టంగా ఉంటుండగా, అమ్మాల్సిన టీటీడీ టికెట్లే అమ్మలేక ఇక్కట్లు పడుతుంటే, రిలయన్స్ వాళ్ళు వచ్చి సహాయం చేసారని చేతులెత్తేస్తే, ఇప్పుడు సినిమా టికెట్లు అమ్ముతావా? ఎలా? ఓ నెట్ వర్క్ లేదు ఏం లేదు, మళ్ళీ రిలయన్స్ ని తీసుకోస్తారా?

అసలు ప్రభుత్వం చేయాల్సింది చికెన్, మటన్, సినిమా టిక్కెట్లు అమ్మాలా? ఇండస్ట్రీలను గాలికొదిలేస్తారా? సినిమాటోగ్రఫీ యాక్ట్ ప్రకారం వీళ్ళు చేసే ఏ చర్య చెల్లదు, అసలు ఏ చట్టాలు తెలియవు, అక్షరం ముక్క రాదు, అంకెలకు, అక్షరాలకు తేడా తెలియనోళ్లందరూ అక్కడ సలహాదారులుగా ఉన్నారు. పేరు చివర ‘రెండు’ అక్షరాలు ఉంటే చాలు సలహాదారుడు అయిపోతాడు.

కోర్టులో కేసులు వేశారని చెప్పి నిన్న విజయనగరంలో 2015లో టాయిలెట్ కడగలేదు, 2017లో సాయంత్రం యురినల్స్ కడగలేదని దిక్కుమాలిన కేసులు పెట్టి క్షత్రియ సమాజంకు సంబంధించిన ఓ 3 ధియేటర్లను మూయించారు, అలాగే కోర్టుకు వెళ్లిన ఇతర ధియేటర్లపై కూడా కేసులు పెడతారు, న్యాయం కోసం పోరాడండి అంటూ ధియేటర్ ఓనర్లకు పిలుపునిచ్చారు.

మీ సంకుచిత స్వభావంతో క్వాలిటీ సినిమాను చంపొద్దు, థియేటర్లను చంపొద్దు, సినిమాపై బతికే లక్షలాది మందిని ఇబ్బంది పెట్టొద్దు, ఏదో ఒకరిద్దరు మంత్రుల చెప్పుడు సలహాలు విని ‘ఏదోకటి చేసుకో పో’ అని మంత్రి గారికి సీఎం ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్లుగా ఆర్ఆర్ఆర్ అన్నారు. కెలకకూడని వ్యక్తులను కూడా మనం కెలికేస్తున్నాము ముఖ్యమంత్రి గారు, అలా చేయకండని, ఈ రోజు ఇలా సినీ పగ సాధిస్తా గురించి చెప్పుకున్నామని అన్నారు ఆర్ఆర్ఆర్.

ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ ధియేటర్ల సీజ్ వ్యవహారం మరింతగా కొనసాగుతోంది. తాజాగా మరో 15 థియేటర్లను నిబంధనలు పాటించడం లేదంటూ సీజ్ చేయడం ఇండస్ట్రీ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా ప్రస్తుతం ధియేటర్లలో ప్రదర్శితం అవుతోన్న “పుష్ప”కు రికవరీ అనేది మరింత కఠినతరం అవుతోంది.