AP CM on AP State Revenue07-01-2022 : ప్రభుత్వ ఉద్యోగులకు 23 శాతం ఫిట్ మెంట్ ప్రకటించిన సందర్భంలో… గత రెండున్నర్రేళ్ళుగా రాష్ట్ర ఆదాయం తగ్గుతూ వస్తోందని స్వయంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రకటించారు. సరిగ్గా పది రోజులు ముందుకు వెళితే…

27-12-2021 : గుడ్ గవర్నెన్స్ పేరుతో 2019తో పోలిస్తే 2020-21లో రాష్ట్ర సొంత ఆదాయం పెరగడమే కాకుండా రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పుల వాటా తగ్గిందంటూ ప్రకటన ఇచ్చుకున్నారు. సరిగ్గా పది రోజుల తేడాలో రెండు వివిధ ప్రకటనలు ఏపీ సర్కార్ నుండి వెలువడడం విశేషం.

అసలింతకీ రాష్ట్ర ఆదాయం పెరిగిందా? తగ్గిందా? అంటే ఏపీకి రాజధాని ఏంటి? అంటే ఏమని సమాధానం చెప్తారు? ఇది అంతే! రాష్ట్రంలో ఆదాయం పెరిగిందో తగ్గిందో అన్న అంశంపై రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రికే స్పష్టత లేకపోతే ఇతరులెవ్వరికైనా ఎలా తెలుస్తుంది?

అయితే ప్రభుత్వం సొంత డప్పు కొట్టుకునేటపుడు ఆదాయం పెరిగిందని, ఉద్యోగులకు ఫిట్ మెంట్ ఇచ్చేటపుడు మాత్రం తగ్గిందని చెప్పడం, కేవలం ప్రజలను మభ్య పెట్టడానికేనా? అన్న ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. దీనికి సీఎం గారో లేక ఆర్ఆర్ఆర్ పిలుచుకునే సకల శాఖామంత్రి వర్యులో సమాధానం చెప్పాలి.

లేటెస్ట్ గా ఉద్యోగులకు చెప్పిన విధంగా ఒకవేళ రాష్ట్ర ఆదాయం తగ్గింది అన్నదే వాస్తవం అనుకుందాం. మరి దీనికి ఎవరు బాధ్యత వహించాలి? అదే నిజమైతే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి సామర్ధ్యత ఎంత? ప్రతి రాష్ట్రం ఆదాయాన్ని పెంచుకుంటూ పోతుంటే, ఏపీ మాత్రమే ఎందుకు తగ్గుతోంది? దానికి గల కారణాలను అన్వేషించారా?

అలాగే ఆదాయం ఎందుకు తగ్గిందో అన్న విషయం కూడా ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత సీఎంపై ఉంది కదా? ప్రపంచమంతా ఉన్న కరోనానే కారణమని చెప్పి ఎన్ని సార్లు తప్పించుకోగలుగుతారు? దేశంలోని ఇతర రాష్ట్రాలలో ఏపీ కంటే ఎక్కువ స్థాయిలోనే కరోనా ప్రభావం ఉందని స్వయంగా జగన్ సర్కార్ వెల్లడించిన గణాంకాలే చెప్తున్నాయి. మరి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులెవ్వరూ మాకు ఆదాయం తగ్గిపోయిందని చెప్పలేదే?

ఇలా కాదు, ‘గుడ్ గవర్నెన్స్’ పేరుతో ముందుగా చెప్పినట్లుగా రాష్ట్ర ఆదాయం పెరిగిందనే అనుకుందాం. ఆదాయం పెరగడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలేమిటి? రాష్ట్రంలో భారీ సంఖ్యలో పెట్టుబడులు రావడం ద్వారా ఆదాయాన్ని ఆర్జించారా? లేక ప్రజలపై చిత్ర విచిత్రమైన పన్నులను వేసి తద్వారా ఆదాయాన్ని పెంచారా? ఏ రకంగా ఆదాయాన్ని పెంచారో చెప్తే ఇతర రాష్ట్రాలలో కూడా ఏపీ సీఎం ఆదర్శప్రాయుడిగా నిలుస్తారు కదా!

అప్పుడు దేశమంతా జగన్ వైపే చూసేదేమో! ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మాత్రం రెండు రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలలో జగన్ మోహన్ రెడ్డిపై ఓ తీవ్ర ఆరోపణ చేసారు. ఫేక్ మాటలకు, ఫేక్ లెక్కలకు, అసత్యాలకు జగన్ మోహన్ రెడ్డి బ్రాండ్ అంబాసిడర్ అన్నట్లుగా మండిపడ్డారు. వీటిని తిప్పికొట్టాలంటే, ‘జగన్ అండ్ కో’ కూడా ఖచ్చితమైన లెక్కలను ప్రజల ముందు ఉంచాల్సిందే!