ఓ స్పెషల్ స్టేటస్... ఓ సీపీఎస్... ఇంత సింపులా..!రాష్ట్రానికి సంబంధించిన కొన్ని కీలకమైన అంశాల మీద అధికార పక్షం వైసీపీ స్పందిస్తోన్న తీరు ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ప్రతిపక్షంలో ఉన్నపుడు ‘స్పెషల్ స్టేటస్’ లేకపోతే ఏపీ భవిష్యత్తు లేదని ఎంతో ఆవేశంగా, బలంగా చెప్పిన జగన్ మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే “కేంద్ర ప్రభుత్వానికి సరిపడా బలం ఉంది, ఇప్పుడు మనమేం చేయలేం” అని సింపుల్ గా చెప్పేసిన జగన్ వ్యాఖ్యలు ఇప్పటికీ ఏపీ ప్రజల ముందు తిరుగాడుతూనే ఉన్నాయి.

ప్రస్తుతం ఉద్యోగులు కూడా ఇదే అనుభూతిని చవిచూస్తున్నారు. తాను అధికారంలోకి వచ్చిన ఒక వారం లోపునే సీపీఎస్ ను రద్దు చేస్తానని ఎన్నికల సందర్భంలో హామీ గుప్పించిన జగన్ మోహన్ రెడ్డి, రెండున్నర్రేళ్ళు గడిచినా ఎలాంటి చర్య తీసుకోలేదు. అయితే తాజాగా మీడియా ముందుకు వచ్చిన సజ్జల రామకృష్ణారెడ్డి, “సాంకేతిక ఇబ్బందులు తెలియక అప్పట్లో ప్రతిపక్ష నేత ఇచ్చిన హామీ అని, దీనిని రద్దు చేయడం కుదరదన్న” అభిప్రాయాన్ని చాలా సింపుల్ గా చెప్పి వెళ్లిపోయారు.

ఒక రాష్ట్ర భవిష్యత్తు… శేష జీవితానికి ఆసరాగా నిలిచే ఉద్యోగుల పెన్షన్… ఇలా రెండు అత్యంత కీలకమైన అంశాలపై రాష్ట్ర సర్కార్ స్పందించిన తీరు పట్ల తీవ్ర స్థాయిలో విమర్శలు వెలువడుతున్నాయి. అత్యంత బాధ్యతా రాహిత్యంగా వైసీపీ సర్కార్ నడుస్తోందని ప్రతిపక్షాలు చేస్తోన్న విమర్శలకు ఊతమిచ్చేలా ఈ చర్యలు ఉంటున్నాయని రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయ పడుతున్నారు.

ఆ మాటకొస్తే ఈ రెండు అంశాలతోనే కాదు, ఇటీవల రైల్వే జోన్ విషయంలో ఇదే జరిగిందన్న విషయాన్ని ప్రతిపక్షాలు ఎత్తి చూపుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర భవిష్యత్తుకు కీలకమైన అంశాలపై తీసుకుంటున్న నిర్ణయాలు, పరిపాలనలోని అవగాహనా లోపాలను సూచిస్తున్నాయని, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి తీసుకునే విధానం ఇది కాదని మీడియాలో జరుగుతున్న చర్చలు కోకొల్లలు