AP Chief Minister YS-Jagan-Mohan-Reddyఆర్ధికంగా ఏపీ ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వైసీపీ పార్టీకి చెందిన సొంత ఎంపీలే పార్లమెంట్ వేదికగా దేశమంతా తెలిసేలా గోడును వెలిబుచ్చుకున్నారు. జీతాలు ఇవ్వడానికి కూడా కష్టసాధ్యమవుతోందని, కేంద్రం తక్షణమే ఆర్ధిక సాయం చేసి ఆదుకోవాలని పలు సందర్భాలలో విజ్ఞప్తులు కూడా చేసారు.

అయితే ఏపీ ఈ పరిస్థితికి కారణం… సంక్షేమ పధకాల పేరుతో ఉచిత పంపకాలేనని కేంద్ర ఆర్ధిక మంత్రి గారు కూడా ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. ఇలా అప్పుల విషయంలో దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ పేరు మారుమ్రోగేలా చేసిన జగన్ సర్కార్ కు ఆ అప్పులను ఎలా తీర్చాలో కూడా తెలుసట. ఈ విషయాన్ని వైసీపీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు.

వచ్చే 30 ఏళ్ళ పాటు జగన్ మోహన్ రెడ్డే ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా ఉంటారట. కరోనా సమయంలో ఆంధ్రప్రదేశ్ ఒక్క రాష్ట్రమే అప్పులు చేయలేదు, దేశంలోని అన్ని రాష్ట్రాలు చేసాయి, ఏపీ కంటే ఎక్కువగా అప్పులు చేసిన రాష్ట్రాలు కూడా ఉన్నాయి, అయితే ఏపీ అప్పులను ఎలా తీర్చాలో ముఖ్యమంత్రి జగన్ కు పూర్తి స్పష్టత ఉందని అన్నారు.

పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా ప్రతి ఏడాది 200 కోట్లు ఆదాయం వచ్చేలా ప్రణాళికలు రచించినట్లు, పర్యాటక సంస్థకు చెందిన 18 రెస్టారెంట్ల నిర్వహణకు 50 టెండర్లు వచ్చాయని, త్వరలోనే వాటిని ఫైనల్ చేస్తామని, అలాగే రాష్ట్రంలో కొత్తగా 8 క్రీడా పాఠశాలలను ప్రారంభిస్తామని చెప్పిన మంత్రి గారు, అతి త్వరలో పెట్టుబడిదారులతో సమావేశం నిర్వహిస్తామని అన్నారు.

అప్పులు ఎలా తీరుస్తారో సీఎంకు తెలుసన్న మంత్రి గారు, ఎలా తీరుస్తారో కూడా చెప్తే ప్రజలకు కొండంత ధైర్యం వస్తుంది. అలాగే ఇదే సమయంలో ప్రతిపక్షాల నోటికి కూడా తాళం వేసిన వారవుతారు. అలా కాకుండా గాల్లో మేడలు మాదిరి, 30 ఏళ్ళు అధికారంలో ఉంటారు, ఎలా అయినా తీరుస్తారు అంటే, ఆ 30 ఏళ్ళు అధికారం ఇవ్వాల్సింది ప్రజలే కదా, అలా ఇవ్వాలంటే అప్పులు ఎలా తీర్చబోతున్నారనే నమ్మకాన్ని ప్రజలకు సీఎం ఇవ్వాలి కదా!