YS-Jagan-Mohan-Reddy not interested in State Govt Employees Offerకొత్త పీఆర్సీని అమలు చేయడం ద్వారా ప్రభుత్వానికి కొత్తగా 10 వేల కోట్ల పైనే భారం పడుతోంది. రాష్ట్రం ఆర్ధికంగా కుదేలు అయ్యి ఉంది గనుక, ప్రస్తుత ఆర్ధిక స్థితికి ఈ కొత్త పీఆర్సీతో సర్థుకుపోండి అంటూ ఏపీ ప్రభుత్వం చెప్తోంది.

ఉద్యోగులు ఏమంటున్నారంటే, అసలు మాకు ఈ కొత్త పీఆర్సీ రద్దు చేసేయండి అని కోరుతున్నారు. దీని కోసం ఎంత దూరమైనా వెళ్తాము, ఆఖరికి నిరవధిక సమ్మెకు నోటీసులు కూడా ఇచ్చారు. ప్రభుత్వం ఈ జీవోను రద్దు చేయకపోతే ఫిబ్రవరి 6 నుండి సమ్మెకు శ్రీకారం చుట్టబోతున్నారు.

మరి ఉద్యోగులు ఇస్తోన్న ఈ “బంపర్ ఆఫర్”ను జగన్ ఎందుకు తిరస్కరిస్తున్నారు. ఈ కొత్త పీఆర్సీని రద్దు చేస్తే ప్రభుత్వానికి 10 వేల కోట్ల భారం పడకుండా ఉంటుంది కదా? ఈ పది వేల కోట్లు యధావిధిగా మరో సంక్షేమ పధకానికి వినియోగించుకోవచ్చు కదా?

జగన్ సర్కార్ చెప్తోన్న 10 వేల కోట్ల భారంలో నిజాయితీ ఉంటే ఇదే జరుగుతుంది. కానీ ప్రభుత్వం ఈ జీవోను రద్దు చేయడానికి ముందుకు రావడం లేదు. దీంతో కొత్త పీఆర్సీ జీవో ప్రకారం తమ జీతాలు తగ్గుతున్నాయని ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న వాదనకు బలం చేకూరుతోంది.

ఇదిలా ఉంటే ఉద్యోగస్తులకు సరైన పీఆర్సీని ఇవ్వలేకపోవడం మాకూ బాధగానే ఉంది, రాష్ట్ర పరిస్థితిని అందరూ అర్ధం చేసుకోవాలి, ఆర్ధిక వెసులుబాటు లేకపోవడమే అసలు కారణం అని వివిధ మంత్రులు ఇప్పటికే చెప్పగా, తాజాగా జగన్ మరో కొత్త సంక్షేమ పధకానికి శ్రీకారం చుట్టడం విశేషం.

ఎందుకంటే రాష్ట్రం ఆర్ధికంగా కుదేలు అయిపోయిందని చెప్పి గగ్గోలు పెడుతున్న ఈ తరుణంలో కూడా నేడు మరో కొత్త పధకానికి సీఎం శ్రీకారం చుట్టారు. వైఎస్సార్ ఈబీసీ (ఎకనామికల్లీ బ్యాక్ వార్డ్ కమ్యూనిటీ) నేస్తం స్కీం క్రింద 589 కోట్ల నిధులను విడుదల చేసారు. ఇది ఉద్యోగస్తులకు పుండు మీద కారం జల్లినట్లు అవుతోంది.

ఎందుకంటే ప్రస్తుతం ఉన్న సంక్షేమ పథకాలకు నిధులను సర్దుబాటు చేసేసరికే ప్రభుత్వానికి తలకు మించిన భారంగా మారి, సమయానికి ఉద్యోగస్తులకు జీతాలు అందివ్వలేకపోతున్నారు. అలాంటిది వీటికి తోడు మరికొన్ని సంక్షేమ పధకాలను అమలు చేయడమంటే, ప్రభుత్వం ఉద్యోగస్తులపై కావాలనే ఈ ధోరణిని అమలు చేస్తోందా? అన్న సందేహాలకు తావిస్తోంది.