Jagan Mohan Reddy New Behaviourఆంధ్రప్రదేశ్ లో రాజకీయం సరికొత్త పుంతలు తొక్కుతుంది. అధికారంలో ఉన్నవారు తమ హోదాతో నిరంకుశ పాలన సాగించడం, ప్రశ్నిస్తే మరింతగా ఇబ్బందులకు గురి చెయ్యడం సర్వసాధారణం అన్నట్టు అయిపోయింది.

అలా జరిగినప్పుడు ఎవరైనా ఎదురు మాట్లాడితే వారిని మరింత ఇబ్బంది పెట్టడం… పక్కన చోద్యం చూసేవాళ్ళు ‘అదిగో ఎదిరించకపోతే వదిలేసేవారు కదా’ అని ఆ వైఖరిని సమర్ధించడమనే నయా బానిసత్వం మొదలయింది.

ఇక విషయానికి వస్తే… ఆంధ్రప్రదేశ్ లో గత కొద్ది రోజులుగా సినిమా టిక్కెట్ల వ్యవహారమే పెద్ద విషయం అయిపోయింది. అసలు రాష్ట్రంలో వేరొక సమస్యే లేనట్టుగా అది పతాక శీర్షికలతో నిలుస్తుంది. పేద వాడికి సినిమా టిక్కెట్ల రేట్ల వల్లే పూటగడవడం లేదని సమర్ధించుకుంటున్నారు. కేవలం కక్షసాధింపుగానే ఇది మొదలైంది అని అందరికీ తెలిసిందే.

పెద్ద పండుగకు విడుదలైన బంగార్రాజు చిత్రానికి మాత్రం ప్రభుత్వం పూర్తి వెసులుబాటు ఇచ్చింది. నాగార్జునతో ఉన్న వ్యక్తిగత, వ్యాపార సంబంధాల కారణంగా ఏకంగా కరోనా విజృంభిస్తున్నా నైట్ కర్ఫ్యూ, 50% ఆకుపెన్సీ వాయిదా వేశారు. ఇక ఏ రేట్లకు టిక్కెట్లు అమ్ముతున్నారు అనేది కూడా పట్టించుకోలేదు.

సరిగ్గా నెల క్రితం విడుదలైన శ్యామ్ సింగరాయ్ సమయంలో మాత్రం థియేటర్ల మీద రైడ్లు, సీజ్లు అంటూ భయబ్రాంతులకు గురి చేసింది ప్రభుత్వం. అయితే ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ అనుకూల మీడియా, అలాగే ఆ పార్టీ సమర్ధకులు… నాని నోటి దురద వల్లే శ్యామ్ సింగరాయ్ ఇబ్బంది పడిందని, నాగార్జున లాగా అణుకువగా ఉంటే ఏలిన వారి దయ ఉండేదని సుద్దులు చెబుతున్నారు.

అసలు నాని ఆ సమయంలో పెద్దగా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా మాట్లాడింది ఏమీ లేదు. ఒకవేళ మాట్లాడినా మాకు వ్యతిరేకంగా మాట్లాడితే ఊరుకోము, మాట్లాడకుండా ఉంటే తప్పేది కదా అని అంటే మాది నిరంకుశత్వం అని ఒప్పుకున్నట్టే కదా?

మేము బానిసలం, మీరు కూడా బానిసత్వం చెయ్యాలని చెప్పడమే కదా? ప్రజాస్వామ్య దేశంలో ఆధునిక వెట్టిచాకిరికి అలవాటు పడిన బానిసలు ఇది మా గొప్ప, మా బలం అనుకుంటే ప్రజలు గమనించరు అనుకుంటున్నారా?