YS Jagan Mohan Reddy Andhra Pradesh Chief Ministerఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో జరుగుతున్న హత్యలు, అత్యాచారాల గురించి నేడు తిరుపతిలో జరిగిన సభలో మాట్లాడిన మాటలు వింటే షాక్ అవక తప్పదు. ఆయన ఏమన్నారంటే “ఈ మద్యనే గుంటూరులో ఏదో జరిగిందని (మీడియా, టిడిపి) నానా యాగీ చేశారు. ఈ మద్యనే గుంటూరులో ఏదేదో జరిగిందని మళ్ళీ నానా యాగీ చేశారు. ఈ మద్యనే విశాఖలో ఇంకా ఏదో ఏదేదో జరిగిపోయిందంటూ నానా యాగీ చేశారు…” అంటూ ఈ నేరాలన్నిటికీ స్క్రిప్ట్, డైరెక్షన్, యాక్షన్ అన్నీ ఈనాడు, ఆంధ్రజ్యోతి, టిడిపి కలిసే చేశాయని, మళ్ళీ అవే తన ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఒక బాలిక, మహిళ అత్యాచారానికి గురైతే అది చాలా బాధాకరమైన, చాలా సున్నితమైన అంశం. కనుక ఎవరైనా దాని గురించి మాట్లాడేటప్పుడు అంతే సున్నితంగా మాట్లాడుతారు. కానీ సిఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం వాటిని ఉద్దేశ్యించి “ఏదేదో జరిగిపోయిందంటూ…” అంటూ వెటకారంగా మాట్లాడటం, అత్యాచారాలు చాలా చిన్న విషయం అన్నట్లు మాట్లాడటం, అంత చిన్న విషయానికే మీడియా, టిడిపి కలిసి నానాయాగీ చేస్తున్నాయని మాట్లాడటం విస్మయం కలిగిస్తుంది.

రాష్ట్రంలో మీడియా, ప్రతిపక్షాలు మహిళలపై జరుగుతున్న అత్యాచారాల గురించి ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తుంటే, జరిగిన తప్పును అంగీకరించి…మళ్ళీ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని చర్యలు తెసుకొంటామని సిఎం జగన్మోహన్ రెడ్డి చెప్పి ఉంటే చాలా హుందాగా ఉండేది. కానీ వాటన్నిటికీ కారణం ఈనాడు, ఆంద్రజ్యోతి, టిడిపి, చంద్రబాబు నాయుడు అన్నట్లు సిఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం ఇంకా షాకింగ్ విషయం. అత్యాచారాలకు కులాలు, పార్టీలకు లింక్ పెట్టి మాట్లాడటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.

తెలుగులో ఓ సామెత ఉంది. ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా? అని. రాష్ట్ర ముఖ్యమంత్రి మహిళలపై జరుగుతున్నా అత్యాచారాలు చాలా చిన్న విషయమన్నట్లు భావిస్తుంటే, మంత్రులు కూడా అదేవిదంగా భావిస్తూ మాట్లాడుతున్నారనుకోవలసి ఉంటుంది.