Andhra-Pradesh-Pawan-Kalyan-Chandrababu-Naidu-YS-Jaganఆంధ్రప్రదేశ్‌లో కుల రాజకీయాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఒకప్పుడు అంటే కాంగ్రెస్‌ హయాంలో రాజకీయాలని రెడ్డి సామాజికవర్గం శాషించేది. టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత కమ్మ సామాజిక వర్గం శాశించింది. అయితే టిడిపి మొదటి నుంచే బీసీలకు కూడా పార్టీలో, ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పించడం వలన కమ్మ సామాజిక వర్గం డామినేట్ చేస్తోందనే భావన కనిపించేది కాదు.

టిడిపి తర్వాత రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రావడంతో మళ్ళీ రెడ్డి సామాజిక వర్గం రాష్ట్ర రాజకీయాలను శాషిస్తోంది. వైసీపీలో కూడా బీసీలకు పదవులు కట్టబెట్టినప్పటికీ పూర్తి పెత్తనం మాత్రం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలదే కావడంతో వారందరూ నామమాత్రపు మంత్రులుగానే మిగిలిపోయారని చెప్పవచ్చు.

మూడు రాజధానుల ప్రతిపాదనని తెర పైకి తెచ్చిన సిఎం జగన్మోహన్ రెడ్డి అమరావతిని పక్కన పెట్టడం కోసం దానిపై కమ్మ ముద్ర వేయడంతోనే రాష్ట్రంలో కమ్మ, రెడ్డి సామాజిక వర్గాల మద్య పోరు ప్రారంభమైంది.

అయితే రాష్ట్రంలో బీసీ ఓట్ బ్యాంక్ కూడా నిర్ణయాత్మక శక్తిగా ఉన్నందున ఆ వర్గాన్ని ఆకర్షించేందుకు వైసీపీ, టిడిపిలు పోటీ పడుతున్నాయి. గత రెండు ఎన్నికలలో కుల సమీకరణాల గురించి మాట్లాడని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ వాస్తవ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఆయా వర్గాలను ఆకర్షించేందుకు సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు.

పవన్‌ కళ్యాణ్‌ ఎప్పటిలాగే రాష్ట్రం, అభివృద్ధి అంటూ రాజకీయాలు చేస్తుండి ఉంటే వైసీపీ పట్టించుకొనేది కాదేమో కానీ ఆయన కూడా రాష్ట్రంలో బలమైన కాపు సామాజిక వర్గాన్ని తనవైపు తిప్పుకొనేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తుండటంతో వైసీపీ ఉలిక్కిపడి ఎదురుదాడి ప్రారంభించిందని చెప్పవచ్చు.

ఇక ఆ వర్గానికి చెందిన బలమైన నాయకుడిగా గుర్తింపు కలిగిన వంగవీటి రాధ, ముద్రగడ పద్మనాభం, చేగొండి హరిరామ జోగయ్య వంటివారు కూడా యాక్టివ్ అవుతుండటంతో ప్రస్తుతం రాష్ట్రంలో కాపు సామాజిక వర్గం చుట్టూ ఓటు బ్యాంక్ రాజకీయాలు నడుస్తున్నాయి.

అధికార, ప్రతిపక్షాలు కాపులతో సహా బీసీలను ఆకర్షించడానికి ప్రయత్నిస్తూనే మరోపక్క ఆయా కులాలు తమ ప్రత్యర్ధులవైపు మరలిపోకుండా అడ్డుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తుండటంతో రాష్ట్రంలో కులాల కుంపట్లు మళ్ళీ రగులుతున్నాయి.

రాష్ట్రాభివృద్ధి, పారిశ్రామికాభివృద్ధి, రాజధాని నిర్మాణం, విద్యా, ఉద్యోగాలు, మౌలిక వసతుల కల్పన ఎవరు చేస్తారని కాక ఆ వ్యక్తి మన కులపువాడా కాదా అని చూస్తుండటంతో, అభివృద్ధికి బదులు కులాల కుమ్ములాటలే కనిపిస్తున్నాయి.

ఏపీ ప్రజల ఈ బలహీనతని తెలంగాణ సిఎం కేసీఆర్‌ కూడా బాగానే గుర్తించారు. అయితే ఏపీలో తనకు తీవ్ర వ్యతిరేకత ఉన్నందున ఏపీలో తన బిఆర్ఎస్‌ పార్టీని విస్తరించేందుకు ప్రజలలో నాటుకుపోయిన ఈ కుల పిచ్చినే తెలివిగా వాడుకోవడానికి సిద్దం అవుతున్నారు. ఏపీలో కుల పిచ్చిని పొరుగు రాష్ట్రంలో పార్టీ కూడా వాడుకోవాలని ఆలోచిస్తుండటం గమనిస్తే ఏపీలో ఇది ఎంత బలంగా పాతుకు పోయిందో అర్దమవుతుంది.

కనుక రాష్ట్ర ప్రజలు ఈ బలహీనత నుంచి బయటపడి రాష్ట్రం గురించి ఆలోచించనంతకాలం రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా అభివృద్ధి సాధ్యం కాదని చెప్పవచ్చు. కానీ రాజకీయ పార్టీలు, ప్రభుత్వం తమ పబ్బం గడుపుకోవడానికి ప్రజలను కులాలవారీగా వేరు చేసి ఉంచేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తుంటాయి. మరి ఏపీ ప్రజలు ఈ కుల బలహీనతల నుంచి బయటపడే ఆ రోజు ఇంకా ఎప్పుడు వస్తుందో ఎదురుచూడాల్సిందే!