Andhra Pradesh High Court Cases on IAS Officersఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలల ఆవరణలో సచివాలయాలు నిర్మించి నిర్వహిస్తున్న కేసులో కోర్టు ధిక్కారణకు పాల్పడినందుకు ఇదివరకు 8 మంది ఐఏఎస్ అధికారులకు జైలు శిక్ష పడటం, వారు న్యాయస్థానానికి క్షమాపణలు చెప్పుకొని శిక్షను రద్దు చేయించుకొన్న సంగతి అందరికీ తెలిసిందే.

ఏపీలో మళ్ళీ మరో ముగ్గురు ఐఏఎస్ అధికారులకు కోర్టు ధిక్కార నేరానికిగాను హైకోర్టు ఒక్కొక్కరికీ నెలరోజులు సాధారణ జైలు శిక్ష, రూ.2,000 జరిమానా విధించింది.

రాష్ట్ర వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, ఇంతకు ముందు ఆ శాఖలో కమీషనర్‌గా చేసిన హెచ్.అరుణ్ కుమార్, పౌరసరఫరాల సంస్థ ఎండీ జి.వీరపాండియన్‌ ముగ్గురికీ నెలరోజులు జైలు శిక్ష, జరిమానా విధిస్తున్నట్లు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ శుక్రవారం ప్రకటించారు.

అయితే వారిలో కోర్టు విచారణకు హాజరైన హెచ్.అరుణ్ కుమార్, జి.వీరపాండియన్‌ అభ్యర్ధన మేరకు వారి జైలు శిక్షను ఆరు వారాలు నిలుపుతూ ఆదేశాలు జారీ చేశారు. కానీ పూనం మాలకొండయ్య కోర్టుకి హాజరుకాకపోవడంతో ఆమె శిక్షను నిలిపేందుకు నిరాకరించారు. దాంతో ఆమె వెంటనే హైకోర్టు ధర్మాసనంలో పిటిషన్‌ వేయగా ఆమె అభ్యర్దన మేరకు శిక్షను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈవిదంగా ముగ్గురూ జైలుకి వెళ్ళకుండా బయటపడ్డారు.

వాళ్ళకీ శిక్షలు, జరిమానాలు దేనికంటే, సుమారు రెండున్నరేళ్ళ క్రితం కర్నూలు జిల్లాలో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ (గ్రేడ్-2) ఉద్యోగానికి ఎన్‌.మదన సుందర్ గౌడ్ ఎంపికైయ్యారు. కానీ జిల్లా ఎంపిక కమిటీ అతనిని పక్కన పెట్టేయడంతో 2019లో హైకోర్టును ఆశ్రయించారు. దానిపై విచారణ చేపట్టిన హైకోర్టు రెండు వారాలలోగా అతనిని ఆ ఉద్యోగంలోకి తీసుకోవాలని 2019, అక్టోబర్ 22న సదరు అధికారులను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కానీ వారు ఆ ఉత్తర్వులను పట్టించుకోకపోవడంతో అతను మళ్ళీ హైకోర్టును ఆశ్రయించారు. ఆ కేసులోనే కోర్టు ధిక్కార నేరానికి పాల్పడినందుకు ముగ్గురు ఐఏఎస్ అధికారులకు హైకోర్టు సింగిల్ జడ్జి నిన్న జైలు శిక్ష, జరిమానా విధించారు.

ఏపీలో ఐఏఎస్ అధికారులకు ఈవిదంగా హైకోర్టుకు హాజరుకావలసి రావడం, వారికి కోర్టు జైలు శిక్షలు, జరిమానాలు విధిస్తుండటం విస్మయం కలిగిస్తుంది. అధికారుల నిర్లక్ష్యానికి, ప్రభుత్వ పనితీరుకి ఇదో చిన్న నిదర్శనంగా భావించవచ్చు.