Andhra Pradesh Capital Shifting after ugadhi 2020 to millenium towersఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ ని రుషికొండలోని మిల్లీనియం టవర్స్ లోకి తరలించడానికి నేవీ ఒప్పుకోలేదు అంటూ వచ్చిన వార్తలను నేవీ ఖండించింది. ఇప్పటివరకు రాష్ట్రప్రభుత్వం అటువంటి ప్రతిపాదన తమకు చెయ్యలేదని వారు చెప్పుకొచ్చారు. దీనితో వైఎస్సార్ కాంగ్రెస్ సమర్ధకులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇది ఇలా ఉండగా… విశాఖకు పాలనా రాజధాని తరలింపు ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసిందని తెలుస్తుంది. ఉగాది తరువాత వివిధ ప్రభుత్వ శాఖలను తరలించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తోంది. దీంతో అవసరమైన భవనాలను గుర్తించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఏప్రిల్ మొదటి వారంలో వివిధ ప్రభుత్వ శాఖలను విశాఖకు తరలించేందుకు చురుగ్గా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

ఇప్పటికే రుషికొండ ఐటీ సెజ్‌లోని మిలీనియం టవర్లలో సచివాలయం, ముఖ్యమంత్రి కార్యాలయం ఏర్పాటు చేసేందుకు అధికారులు నిర్ణయానికి వచ్చారు. అధికారికంగా ప్రకటించపోయినప్పటికీ, వాటినే ఖరారు చేయవచ్చని భావిస్తున్నారు. ఏప్రిల్ నాటికి ప్రభుత్వ శాఖల తరలింపు ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

దీంతో వివిధ శాఖల ప్రధాన కార్యాలయాల ఏర్పాటుకు అనువైన భవనాలను గుర్తించాలని ఆయా శాఖల అధికారులకు వౌఖిక ఆదేశాలు జారీ అయ్యాయి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసే నాటికి కోర్టు వివాదం కూడా కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు. అయితే భవనాల కొరత ప్రభుత్వాన్ని వేధిస్తుంది. ఇందు కోసం ఇప్పటికే ఉన్న జిల్లా కార్యాలయాలను విశాఖనుంచి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.