andhra pradesh capital depends on greater visakhapatnam municipal corporation electionsవిశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) ఎన్నికల నిర్వహణకు ఒకవైపు చకచకా ఏర్పాట్లు జరుగున్నప్పటికీ ఎన్నికలు జరుగుతాయా అనేది చివరి నిముషం వరకూ అనుమానంగానే ఉంది. పరిపాలనా రాజధానిగా విశాఖను ప్రకటించిన నేపథ్యంలో మేయర్‌ పీఠం దక్కించుకోవడాన్ని అధికార పార్టీ ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది.

ఒకవేళ ఏదైనా తేడా జరిగితే పరువు పోతుందనే ఆందోళన ఆ పార్టీలో వ్యక్తమవుతోంది. అయితే అదే సమయంలో టీడీపీ ఇక్కడ ఇటీవలే జరిగిన ఎన్నికలలో రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ గాలి వీచినా నగరంలోని నాలుగు (తూర్పు, దక్షిణం, ఉత్తరం, పశ్చిమ) స్థానాలను మాత్రం టీడీపీ గెలుచుకుంది. ఎంపీ సీటు కూడా జనసేన అభ్యర్థి జేడీ లక్ష్మీనారాయణ వల్ల టీడీపీ స్వల్ప తేడాతో పోగొట్టుకుంది.

దీనితో టీడీపీ కూడా మెరుగైన ప్రదర్శన ఇవ్వడానికి పట్టుదలగా ఉంది. గతంలో విశాఖ ఎంపీగా జగన్ తల్లి విజయమ్మ పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. దీనిబట్టి అధికార పక్షానికి జీవీఎంసీ ఎన్నికలు అంత తేలిక కాదని స్పష్టం అవుతుంది. ఒకవేళ వైఎస్సార్ కాంగ్రెస్ ఓడిపోతే ఈ ఎన్నికలను మూడు రాజధానులు రెఫరెండం గా ప్రతిపక్షాలు ప్రచారం చేస్తాయి.

దీనితో రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి విశాఖలోనే మకాం వేసి మేయర్ పీఠం వైఎస్సార్ కాంగ్రెస్ ని వరించేలా పావులు కదుపుతున్నారు. పరిస్థితులు అనుకూలంగా లేకపోతే ఎన్నికను వాయిదా వేయడం ఉత్తమమనే భావన ఆ పార్టీలోని నేతలు కొందరు వ్యక్తపరుస్తున్నట్టు ద్వితీయశ్రేణి నేతలు, జీవీఎంసీ అధికారులు పేర్కొంటున్నారు.