తెలుగు దేశం పార్టీతో తెగతెంపుల అనంతరం కొత్త అధ్యక్షుడి వేటలో పడింది బీజేపీ నాయకత్వం. ఈ మార్పుతో పార్టీ ఆంధ్రప్రదేశ్ లో పరుగులు పెడుతుందని వారి అభిప్రాయం. ఇలా ఉంటే పార్టీలో ఉన్న కాస్తో కూస్తో పేరున్న అందరి నాయకులకు అధ్యక్షపదవి కావాలంట. ఇప్పటికే ఎమ్మెల్సీ సోము వీర్రాజు తన పేరు ప్రకటించే వరకు వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు.
తన పేరు ప్రకటించకపోతే తనకు పార్టీ వ్యవహారాలు పట్టవని ఆయన ఇండైరెక్టుగా చెబుతున్నారు. మరోవైపు సోము వీర్రాజు పేరు ప్రకటిస్తే తాను తన దారి తాను చూస్కుంటా అని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ అధిష్టానానికి వార్నింగ్ ఇచ్చారట. సీనియర్ నేతలు పురంధేశ్వరి, కన్నా లక్ష్మీ నారాయణ కూడా ఇదే పదవిని ఆశిస్తున్నా రట.
కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడీకే అవకాశం ఇవ్వాలని అధిష్టానం నిర్ణయం తీసుకోవడం తో పురందేశ్వరి కి అవకాశం లేనట్టే అని సమాచారం. అయినా ఆవిడ ప్రయత్నాలు ఆవిడ చేస్తున్నారు. అందరూ పదవి ఇస్తేనే పని చేస్తాం అనే సంకేతం ఇవ్వడంతో ఇదెక్కడి గోల అని అధిష్టానం తల పట్టుకుంటుంది. దీనితో అధ్యక్షుడి ప్రకటన ఆలస్యం అవుతుంది. ఉన్నది నలుగురు… నలుగురికి అధ్యక్షపదవి కావాలంటే ఎలా చచ్చేది?