Somu-Veerraju On Budgetబుగ్గన ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ పై అటు టీడీపీతో ఇటు బీజేపీ కూడా విమర్శలు గుప్పించింది. అప్పులు చేస్తూ సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించడం గొప్ప కాదు ముఖ్యమంత్రి గారు అంటూ బడ్జెట్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు.

బడ్జెట్ లో పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు నిధులు ఎందుకు కేటాయించలేకపోయారని., రాజధాని అభివృద్ధికి ఎంత మేరకు నిధులు ఖర్చు పెడుతున్నారో తెలపాలని., కేటాయిచిన నిధులన్నీ ఎవరి ఖాతాలో చేరుతున్నాయో తమకు తెలుసునని వైసీపీ ప్రభుత్వం ఖర్చులు – ఆదాయానికి సంబంధించిన శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో జగన్ పడేస్తున్నారని., ఆదాయాన్ని పెంచే మార్గాలను చూడకుండా సంక్షేమం పేరుతో ఏపీ ప్రజల నెత్తిన అప్పుల భారాన్ని పెంచుకుంటూ పోతున్నారని వాపోయారు. పెన్షన్లు పెంచుకుంటూ పోతాం అని ఎన్నికల్లో చెప్పి అధికారంలో వచ్చాక పన్నులను., అప్పుల భారాన్ని., నిత్యవసర వస్తువుల ధరలను పెంచుకుంటూ పోతున్నారని “మాట తప్పం – మడం తిప్పం” అంటే ఇదేనా జగన్ రెడ్డి అంటూ ఘాటైన ప్రశ్నలే సంధించారు సోము వీర్రాజు.

రాష్ట్రంలో వైసీపీ తీరు చూస్తుంటే అప్పులు చేసి జనాలకు డబ్బులు పంచి ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ‘జగన్ అండ్ కో’ ఉన్నారంటూ ప్రభుత్వంపై టీడీపీ విమర్శల దూకుడు పెంచింది. అలాగే బీజేపీ కూడా అవకాశం చిక్కిన ప్రతిసారి ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సందిస్తూనే ఉంది. ఇక జనసేన అయితే వైసీపీ అంటేనే మండిపడిపోతుంది. ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చేసిన అప్పులకు బాధ్యతగా ప్రజలు మిగలడం అత్యంత బాధాకరమని సగటు ఓటరు ఆవేదన.