kanna lakshmi narayanaఅమరావతి నుండి రాజధాని తరలింపు పై ఒక వ్యూహమంటూ లేని పార్టీ ఏదైనా ఉంటే అది బీజేపీనే కావొచ్చు. సహజంగా బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో చెప్పుకోదగిన పార్టీ ఏమీ కాదు అయితే కేంద్రంలో అధికారంలో ఉండటంతో ఆ పార్టీ ఉద్దేశం కూడా ఇప్పుడు ముఖ్యమే. అయితే బీజేపీ నాయకులు మాత్రం ఈ విషయంలో ప్రాంతాల వారీగా విడిపోయారు.

అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరి వంటి వారు అమరావతి రైతులకు పూర్తి మద్దతు ఇస్తుంటే, జీవీఎల్ నరసింహ రావు, కేంద్ర హోమ్ సహాయ శాఖా మంత్రి కిషన్ రెడ్డి వంటి వారు అది కేంద్రం పరిధిలోని అంశం కాదని రాజధాని తరలింపుకు పరోక్షంగా మద్దతు ఇస్తున్నట్టు మాట్లాడుతున్నారు.

రాష్ట్ర అధ్యక్షుడిని కాబట్టి నేను చెప్పేదే ఫైనల్ అని కన్నా అంటుంటే… పార్టీ జాతీయ అధికార ప్రతినిధిని కాబట్టి కేంద్రం ఎలా ఆలోచిస్తుందో నాకు తెలుసు అంటూ చెప్పుకొస్తున్నారు జీవీఎల్ నరసింహ రావు. ఈ తరుణంలో గుంటూరు బీజేపీ కార్యాలయంలో కన్నా అధ్యక్షతన రాష్ట్ర కమిటీ సమావేశం అయ్యింది.

ఈ భేటీలో ముఖ్యనేతలు సుజనాచౌదరి, పురంధేశ్వరి, జీవీఎల్‌ నరసింహారావు, ఎమ్మెల్సీలు మాధవ్‌, సోము వీర్రాజు హాజరయ్యారు. పార్టీ కార్యక్రమాలు, రాజధాని అమరావతి అంశంపై సమాలోచనలు చేస్తున్నారు. ఈ సమావేశం అనంతరం పార్టీ అమరావతి విషయంగా ఒకే మాట మీదకు రావాలని వారు భావిస్తున్నట్టు సమాచారం. దీనితో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.