ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన పై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ నిప్పులు చెరిగారు. ప్రభుత్వం అస్తవ్యస్తంగా చేస్తున్న అప్పులు ఆయన తీవ్ర పదజాలంతో విమర్శిస్తూ… మార్చి నాటికి ఆంధ్రప్రదేశ్ సంక్షోభంలోకి వెళ్లబోతుందని చెప్పుకొచ్చారు.
ఈ క్రమంలో ఇటీవలే మటన్ వ్యాపారంలోకి ప్రభుత్వం వస్తుంది అనే దాని మీద కూడా ఆయన స్పందించారు. “ఇవన్నీ దరిద్రం వల్ల వచ్చిన ఆలోచనలు. జేబులో డబ్బులు లేవు. నెల అయ్యేసరికి జీతాలు ఇవ్వాలి. ఆ టైం లో మటన్ వ్యాపారం 10,000 కోట్లు ఉంటుంది. ప్రభుత్వానికి ఆదాయం లేదు. ఆన్ లైన్ చేసేస్తే 100 కోట్ల ఆదాయం అని ఎవడో అంటాడు,” అని ఉండవల్లి చెప్పుకొచ్చారు.
“ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వనికి విషమ పరిస్థితులు ఎదురవుతున్నాయి. పరిస్థితి భయానకంగా ఉంది వాతావరణం. మనకు వచ్చే ఆదాయం జీతాలకు, స్కీంలకే మనకు వచ్చే దానితో పాటు 20% అప్పు చెయ్యాలి. ఇక క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్లే లేవు,” అన్నారు ఆయన.
పోలవరం ప్రాజెక్ట్ మీద కూడా ఉండవల్లి ఘాటు వ్యాఖ్యలు చేశారు. “పోలవరం పూర్తి అవుతుంది. అయితే రిజర్వాయిర్ ఉండదు. ఆనకట్ట కట్టేస్తారు. పోలవరం బ్యారేజ్ గా మిగిలిపోతుంది. వైఎస్ రాజశేఖరరెడ్డి అనుకున్న ప్రాజెక్ట్ గా మాత్రం అవ్వదు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ వస్తే ఏమన్నా మారొచ్చు,” అని అన్నారు ఉండవల్లి.