ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగులు నిర్వహించిన “ఛలో విజయవాడ”కు సంబంధించి జగన్ సొంత మీడియా సంస్థ అయిన సాక్షి ఏ విధంగా కవర్ చేసిందో అందరికీ తెలిసిందే. ఉద్యోగులకు జీతాలు పెంచితే ఆందోళన చేస్తున్నారన్న ప్రచారం ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా చేసారు.
ఇక నేడు దినపత్రిక విషయానికి వస్తే… ఉద్యోగులు చేసిన ర్యాలీలో రాజకీయ పార్టీలు సందడి చేసాయట. వారితో పాటు భారీగా జనసమీకరణ చేసారట. ఇలా జగన్ సొంత మీడియాలో ఉద్యోగులు చేసిన ర్యాలీని కూడా పక్కదోవ పట్టించేలా ప్రచారం చేస్తున్నారు.
తాజాగా వచ్చిన ఇంటిలిజెన్స్ నివేదిక ప్రకారం దాదాపుగా 4 లక్షల మంది ఉద్యోగులు “ఛలో విజయవాడ” కార్యక్రమంలో పాల్గొన్నారన్న సమాచారం వస్తుండగా, సాక్షిలో కధనాలు మాత్రం ఉద్యోగులను బద్నామ్ చేసే విధంగా ఉండడం, ప్రభుత్వ తీరుకు అద్దం పడుతోంది.
ఏదైనా సహాయం కావాలంటే తాను చేస్తానని చెప్పినా, ఇందులో రాజకీయ పార్టీలు జోక్యం అవసరం లేదని ఉద్యోగ సంఘ నేతలు చెప్పిన వైనాన్ని జనసేన అధినేత సాయంత్రమే చెప్పుకొచ్చారు. అలాగే టిడిపి కూడా ఉద్యోగులకు నైతిక మద్దతు మాత్రమే ప్రకటించింది.
ఇలా రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా జరిగిన విషయాన్ని రాజకీయ రంగు పులిమి పక్కదారి పట్టించడం సాక్షి యొక్క జర్నలిజం విలువలను ప్రజలకు తెలియజేసేలా చేస్తోందని జనసైనికులు మండిపడుతున్నారు. ఎందుకంటే స్వయంగా పవన్ కల్యాణే ‘ఛలో విజయవాడ’పై స్పష్టంగా చెప్పడంతో, మళ్ళీ దానిని రాజకీయ పార్టీలకు ఆపాదించడం ఏమిటన్న? ప్రశ్నలు వేస్తున్నారు.
ఈ ఒక్క విషయంలోనే కాదు, దాదాపుగా ప్రభుత్వానికి వ్యతిరేకత ఉన్న ప్రతి అంశంలోనూ సాక్షి తీరు ఇలాగే ఉంటుందని గతంలో కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ వర్గాలైతే ‘సాక్షి’ని ఒక అసత్య పత్రికగా కీర్తించారు. బహుశా ఇపుడు ఉద్యోగులు ఈ స్లోగన్ ను నెత్తిన పెట్టుకుంటారేమో చూడాలి.