Andhra Pradesh Assembly Council Chairman Shariff Mohammed Ahmedరాజధాని మార్పుకి సంబంధించిన రెండు బిల్లుల పై సెలెక్ట్ కమిటిల వివాదం ముదురుతోంది. ప్రభుత్వ ఒత్తిడితో సెలెక్ట్ కమిటీలను ఏర్పాటు చేయలేమంటూ ఛైర్మనుకు మండలి కార్యదర్శి స్పష్టం చేసిన విషయం తెలిసిందే. సెక్షన్ 154 ప్రకారం సెలెక్ట్ కమిటీలను ఏర్పాటు చేసే అధికారం లేదని.. అలాగే తనకున్న నిబంధనలు.. పరిమితులను కూడా ప్రస్తావిస్తూ మండలి ఛైర్మన్ షరీఫుకు మండలి సెక్రటరీ నోట్ రాసినట్టు తెలుస్తోంది.

దీనిపై మండలి ఛైర్మన్ ఎంఏ షరీఫ్ మండలి కార్యదర్శిపై సీరియస్ అయ్యారు. సెలెక్ట్ కమిటిలను ఏర్పాటు చెయ్యకపోవడం, సభా నిర్ణయాన్ని, ఛైర్మన్ ఆదేశాన్ని పట్టించకపోవడమే అవుతుందని, వెంటనే కమిటిలను ఏర్పాటు చేసి, ఆయా కమిటిల సభ్యులకు సమాచారం ఇవ్వాలని ఛైర్మన్ కార్యదర్శిని ఆదేశించారు.

ఇప్పుడు దీనిపై మండలి కార్యదర్శి ఏం చేస్తారా అనేది ఆసక్తిగా మారింది. ఒకవేళ మండలి చైర్మన్ ఆదేశాలను కార్యదర్శి పాటించకపోతే ఆయన మీద ఆర్టికల్ 311 ప్రకారం యాక్షన్ తీసుకునే అవకాశం ఉందని టీడీపీ వారు అంటున్నారు. అయితే సెలెక్ట్ కమిటిల ఏర్పాటు జరగలేదు కాబట్టి… అలాగే సభ సదరు బిల్లులను తిరస్కరించలేదు కాబట్టి అవి పాస్ అయినట్టే భావించి గవర్నర్ వద్దకు పంపాలని ప్రభుత్వం భావిస్తుంది.

అప్పుడు గవర్నర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. టీడీపీ ఈ విషయంగా కోర్టుకు వెళ్లే అవకాశాన్ని కూడా పరిశీలిస్తుంది. అయితే శాసనసభ, మండలి వ్యవహారాలలో కోర్టులు ఏ మేరకు కలగజేసుకుంటాయి అనేది కూడా చూడాల్సి ఉంది.