Andhra_Pradesh_Assembly_Budget_Session_2023నేటి నుంచి ఏపీ బడ్జెట్‌ సమావేశాలు మొదలుతాయి. ఆనవాయితీ ప్రకారం ఉదయం 10 గంటలకు గవర్నర్‌ అబ్దుల్ నజీర్ ఉభయసభల సభ్యులను ఉద్దేశ్యించి ప్రసంగిస్తారు. తర్వాత ఉభయసభలు వాయిదా పడతాయి. ఆ తర్వాత స్పీకర్ తమ్మినేని అధ్యక్షతన బీఏసీ సమావేశం నిర్వహించి బడ్జెట్‌ సమావేశాల షెడ్యూల్, సమావేశాల అజెండాను ఖరారు చేస్తారు. బీఏసీ సమావేశం ముగిసిన తర్వాత సిఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. బడ్జెట్‌ సమావేశాలలో ప్రవేశపెట్టాల్సిన బిల్లుల గురించి దానిలో చర్చించి ఆమోదిస్తారు. తర్వాత రాష్ట్ర బడ్జెట్‌కు ఆమోదముద్ర వేస్తారు. ఈ నెల 17వ తేదీన రాష్ట్ర ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శాసనసభలో రాష్ట్ర బడ్జెట్‌ ప్రవేశపెడతారు. ఈసారి రాష్ట్ర బడ్జెట్‌ సుమారు రూ.2.60 లక్షల కోట్లు ఉండవచ్చని తెలుస్తోంది.

బడ్జెట్‌ సమావేశాలైనా మరోటైనా… ఉభయసభలలో జరిగేది ఒకటే. గత ప్రభుత్వం కంటే తమ ప్రభుత్వం ఎంతో మెరుగైన పాలన అందిస్తోందంటూ వైసీపీ సొంత డప్పు కొట్టుకోవడం, పనిలో పనిగా చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌లను తీవ్రంగా విమర్శించడం. బడ్జెట్‌లో అంకెల గారడీ చేసి చూపడం.

ఈసారి అదనంగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో రూ.13.56 లక్షల కోట్ల పెట్టుబడులు, 6 లక్షల ఉద్యోగాలంటూ అదనపు డప్పు మోత గట్టిగా వినిపించవచ్చు. మూడు రాజధానుల ప్రస్తావన లేకుండా సమావేశాలు జరుగవు. కనుక విశాఖ రాజధాని, సిఎం జగన్మోహన్ రెడ్డి విశాఖకు తరలివెళ్ళడం గురించి కూడా కాలక్షేప కబుర్లు వినిపించవచ్చు.

అయినా ఉద్యోగులకు నెలనెలా జీతాలు చెల్లించలేకపోగా వారి జీపీఎఫ్ ఖాతాలలో పొదుపు చేసుకొన్న సొమ్మును కూడా తీసి వాడేసుకొంటున్న వైసీపీ ప్రభుత్వం రూ.2.60 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతుండటం హాస్యాస్పదంగా లేదూ?