Kakani-Govardhan-Reddy First Signature as Ministerవివాదాల తోరణాల నడుమ వ్యవసాయశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కాకాణి గోవర్ధన్ రెడ్డి గురువారం సచివాలయం రెండో బ్లాకులో పూజలు చేసి మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. గత కొన్నేళ్ళుగా ‘తొలి సంతకం ట్రెండ్’ నడుస్తోంది కనుక కాకణివారు కూడా నేడు తొలి సంతకం చేసేశారు. రూ.1,395 కోట్లు వ్యయంతో రాష్ట్రంలో 3.75 లక్షల ఎకరాలకు మైక్రో ఇరిగేషన్ ఏర్పాటు చేసేందుకు ఫైల్‌పై తొలి సంతకం చేసేరు. అది ఎప్పుడు ఏవిదంగా అమలవుతుందో చూడాలి. ఇక రెండో సంతకంలోనే జగన్ సంక్షేమ ముద్ర పడింది. వైఎస్సార్ యంత్ర పధకం కింద 3,500 ట్రాక్టర్లకు సంబందించి ఫైల్‌పై కాకణివారు రెండో సంతకం చేశారు. ఒక ట్రాక్టర్ ధర కనీసం రూ. 9-12 లక్షల మద్య ఉంటుంది. అంటే కనీసం ఈ పధకం అమలుకి రూ.31,500 కోట్లు అవసరం అన్న మాట!

ఒక మంత్రిగారి మొదటి రెండు సంతకాల ఖరీదే రూ. 32,895 కోట్లు అయితే జగనన్న మంత్రివర్గంలో మరో 25 మంది మంత్రులున్నారు. వారందరి తొలి సంతకాలకు ఎంతవుతుందో ఊహించలేము. అయితే ఈ ‘ఖరీదైన తొలి సంతకం ఫెసిలిటీ’ బహుశః కొందరికే ఉంటుందేమో?మిగిలినవారు అధికారులు తమ టేబిల్ మీద పెట్టిన పాత ఫైల్స్‌పై తొలి సంతకాలు చేసుకొని తృప్తి పడక తప్పదు. లేకుంటే తొలిసారిగా రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాలు మరియు యువజన అభ్యుదయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజమ్మ గండికోట బెంగళూరు మద్య బస్ సర్వీసు ప్రారంభానికి సంబందించిన ఫైల్‌పై తొలి సంతకంతో సర్దుకుపోవాల్సిన ఖర్మేమిటి?కనుక మంత్రులలో కొందరు పెద్ద మంత్రులు, కొందరు చిన్న మంత్రులు ఉంటారని తొలి సంతకంతోనే వారి స్థాయి ఏమిటి అర్దమైపోతుందన్న మాట! మరి రోజమ్మ మిగిలిన మంత్రులు ఎవరెవరు ఏ కేటగిరీలోకి వస్తారో?ఎవరెవరికి ఈ ఖరీదైన తొలి సంతకం ఫెసిలిటీ ఉందో?