Andhra Pradesh 2019 CM - YS Jaganఇటీవల కాలంలో ప్రభుత్వ ఉద్యోగులపై ప్రతిపక్ష నేత ఓ స్థాయిలో మండిపడుతున్న విషయం తెలిసిందే. విధి నిర్వహణలో భాగంగా ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా తనకు అడ్డు చెప్తే… మరుక్షణం జగన్ నోటి వెంట వెలువడే మాట… ఇవన్నీ గుర్తు పెట్టుకుంటాను, మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటాను… కాబోయే ముఖ్యమంత్రిని నేను… అంటూ చెప్పడం చూస్తూనే ఉన్నాం. ఇదేదో ఒకటి, రెండు సార్లు అని వదిలేసిన మాట కాదు. పదే పదే జగన్ నోటి వెంట వస్తూ… అది పతాక స్థాయికి వెళుతున్నట్లుగా కనపడుతోంది.

బహుశా తన చుట్టూ ఉన్న కోటరీ అంతా అలా జగన్ ను ప్రలోభ పెడుతుందో లేక నిజంగా జ్యోతిష్యాన్ని నమ్మి ఈ వ్యాఖ్యలు చేస్తున్నారో గానీ… నిజంగా ముఖ్యమంత్రి అయ్యేవారు కూడా ఈ రేంజ్ లో ప్రభుత్వ ఉద్యోగులకు వార్నింగ్ లు ఇవ్వరని పొలిటికల్ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ప్రజలకు ఏ సమస్య తలెత్తినా… దాని పరిష్కారం తాను ముఖ్యమంత్రిని కావడమే అన్న రీతిలో ప్రజల దగ్గర కూడా జగన్ మొరపెట్టుకున్న విధానం… ప్రత్యర్ధి రాజకీయ పార్టీలు విమర్శలు చేయడానికి అవకాశం ఇచ్చినట్లుగా ఉంది.

తాజాగా పులివెందుల నియోజకవర్గంలోని లింగాల ఎంపీడీవో కార్యాలయం వద్ద నిర్వహించిన ప్రజాదర్బార్‌ లో ‘2019లో నేనే సిఎం’ అంటూ పలికి, అధికారులను జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులతో నిర్వహించిన ఈ దర్బారులో మండలంలోని 16 పంచాయతీల ప్రజా ప్రతినిధులు, ప్రజలతో జగన్ విడివిడిగా సమావేశమయ్యారు. తాగునీటి సమస్య ఉన్న ప్రాంతాల్లో సత్వరమే ఆ సమస్యను పరిష్కరించాలని అధికారులకు జగన్ సూచించారు.

ఈ సందర్భంగా ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ డబ్బుల కోసం వేధిస్తున్నారని పలువురు ప్రజాప్రతినిధులు, ప్రజలు ఫిర్యాదు చేశారు. డబ్బులిచ్చిన వారికే బిల్లులు త్వరగా వచ్చేలా చూస్తున్నారని, లేకుంటే కాళ్లరిగేలా తిప్పించుకుంటున్నారని పేర్కొన్నారు. దీంతో స్పందించిన జగన్ ‘‘2019 ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గానికే సీఎం పదవి వస్తుంది. మేం అధికారంలోకి వచ్చాక మీపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరిపిస్తా. ఇప్పటికైనా జరిగినవి మర్చిపోయి నిజాయితీగా పనిచేయండి’’ అని అధికారులను హెచ్చరించారు. ఇన్ని హెచ్చరికలు అందుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగులు నిజంగా తనకు ఓటు వేస్తారని జగన్ భావిస్తున్నారా?