Andamaina Jeevitham Trailer Talkగత రెండు సంవత్సరాల నుండి తెలుగు సినిమాలు పుంజుకోవడంతో డబ్బింగ్ సినిమాల హవా తగ్గింది. అలాగే విడుదలైన కొన్ని సినిమాలు కూడా బాక్సాఫీస్ బరిలో నిలవలేకపోయాయి. దీంతో కేవలం సెలక్టివ్ గా మాత్రమే డబ్బింగ్ బొమ్మలు ప్రేక్షకులను పలకరిస్తున్నాయి. అయితే ఇటీవల కాలంలో టాలీవుడ్ లో క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్లను దృష్టిలో పెట్టుకుని కొన్ని సినిమాలు టాలీవుడ్ ప్రేక్షకులపైకి దండెత్తబోతున్నాయి.

ఆ జాబితాలో సాయిపల్లవి నటించిన “హేయ్ పిల్లగాడా” సినిమా టీజర్ విడుదల కాగా, తాజాగా అనుపమ పరమేశ్వరన్ నటించిన ఓ సినిమాను తెలుగులో “అందమైన జీవితం” పేరుతో తీసుకువస్తున్నారు. ఈ రెండు సినిమాలలో హీరో దుల్కర్ సల్మాన్ కావడం విశేషం. అయితే “అందమైన జీవితం” సినిమా విషయానికి వస్తే, ప్రమోషన్ లో భాగంగా ఇటీవల ఓ రెండు ట్రైలర్స్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

ఈ రెండు ట్రైలర్స్ ఎలా ఉన్నాయి అన్నది పక్కన పెడితే, తాము టైటిల్ గా భావించిన “అందమైన జీవితం” అన్న దానికి ఓ లోగో కూడా లేకుండా విడుదల చేయడం విస్మయానికి గురి చేసే అంశం. కేవలం ఓ టైటిల్ ను పెట్టేసి టీవీ సీరియల్ కంటే దారుణంగా ఈ ట్రైలర్ లో టైటిల్స్ కనపడుతున్నాయి. ఈ మాత్రం దానికి సినిమాకు డబ్ చేయడం ఎందుకు అనుకోవడం వీక్షకుల వంతవుతోంది. క్వాలిటీ లేని సినిమాలను అగ్ర హీరోలు చేస్తుంటేనే తిరస్కరిస్తున్న రోజులలో, ఇలాంటి బొమ్మలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారా?