andama-official-single-kaasi-vijay-antonyమార్చి 30వ తేదీన సుకుమార్ – రామ్ చరణ్ ల “రంగస్థలం” సినిమా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. తాజా టీజర్ ద్వారా ఈ విషయాన్ని చిత్ర యూనిట్ కూడా ధృవీకరించింది. అయితే ఈ సమాచారం వచ్చి 24 గంటలు గడవక ముందే మరో మాస్ మూవీ అదే తేదీన విడుదల కావడానికి సిద్ధమైంది. ‘బిచ్చగాడు’ నుండి వరుసగా తెలుగు నాట సినిమాలు విడుదల చేస్తున్న విజయ్ అంటోనీ నటించిన “కాశి” అనే చిత్రాన్ని మార్చి 30వ తేదీన విడుదల చేయబోతున్నారు.

ఈ సినిమాకు సంబంధించిన తొలి పాటను ‘రంగస్థలం’ హీరోయిన్ సమంత విడుదల చేయడం విశేషం. ‘అందమా…’ అనే మెలోడీ సాంగ్ కు సంబంధించిన ఫుల్ వీడియోను రిలీజ్ చేసి, విడుదల తేదీని ఖరారు చేసారు. ‘బిచ్చగాడు’ సినిమా తర్వాత విజయ్ అంటోనీ నటిస్తున్న సినిమాలకు ఓపెనింగ్స్ బాగానే వస్తున్నా, వాటిని నిలబెట్టుకోవడంలో మాత్రం విజయ్ విఫలమవుతున్నాడు. మరి ఈ ‘కాశి’ చిత్రంతో అయినా ఆకట్టుకుంటాడో లేదో చూడాలి.

అయితే ‘రంగస్థలం’ మాదిరే ఈ ‘కాశి’ కూడా గ్రామీణ వాతావరణంలో సాగే మాస్ సినిమా కావడం గమనించదగ్గ విషయం. రామ్ చరణ్ తో విజయ్ అంటోనీ పోటీ అని చెప్పలేం గానీ, ఈ రెండు సినిమాలు ఒకే జోనర్ కు చెందినవి కావడం, ఒకే రోజున విడుదల కావడం కాకతాళీయమే! బహుశా రిలీజ్ డేట్ దగ్గరకు వచ్చే సమయానికి ‘కాశి’లో మార్పు ఉండొచ్చు అనేది ట్రేడ్ టాక్.