pradeep machiraju 30 rojjulo preminchadam elaతెలుగింట యాంకర్ గా సుపరిచితమైన పేరు… ప్రదీప్ మాచిరాజు. 30 రోజులలో ప్రేమించడం ఎలా అనే సినిమాతో హీరోగా అవతారం ఎత్తుతున్నాడు. గత ఏడాది వేసవికి రావాల్సిన సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. రేపు (జనవరి 29)న విడుదల. ఈ చిత్రంలోని నీలి నీలి ఆకాశం అనే పాట సూపర్ హిట్ కావడంతో సినిమాకు మంచి బజ్ వచ్చింది.

అయితే టీవీ షోలలో వన్ అఫ్ ది హైయెస్ట్ పైడ్ యాక్టరైనా ప్రదీప్ ఈ సినిమాకు రెమ్యూనరేషన్ లేకుండా పని చేశాడట. “టీవీ వల్ల ఎంత పేరొచ్చినా నేను సినిమాకు కొత్త కుర్రాడినే. ఈ సినిమాకు నేను ఏమి తీసుకోకుండా పని చేశా. నాకిచ్చే అమౌంట్ వేరే వాటికి ఉపయోగపడుతుంది. పెద్ద మ్యూజిక్ డైరెక్టర్, పెద్ద పాటల రచయిత, అన్నపూర్ణలో సిజీ, డీఐ ఇలా అంతా గ్రాండ్ గా జరిగింది,” అని చెప్పుకొచ్చాడు.

“నాకు రెమ్యూనరేషన్ వద్దు అన్నప్పుడు ప్రొడ్యూసర్ ఒప్పుకోలేదు. ఉంచండి సినిమా అయ్యాకా చూసుకుందాం అని చెప్పా,” అంటూ చెప్పుకొచ్చాడు ప్రదీప్. ఏది ఏమైనా మొదటి సినిమాకే చాలా మ్యాచుర్డ్ గా అలోచించి అటు నిర్మాతకు తన సొంత సినిమాకు హెల్ప్ అయ్యాడని చెప్పవచ్చు.

పాట సక్సెసైన కారణంగా 30 రోజులలో ప్రేమించడం ఎలా కు ఓటీటీలలో కూడా మంచి ఆఫర్లు వచ్చాయట. అయితే థియేటర్లలోనే విడుదల చెయ్యాలని నిర్మాత పట్టుదలగా ఈ సినిమాను ఇన్ని నెలలు ఆపారు. మొత్తానికి విడుదల సమయం రానే వచ్చింది. మరి బుల్లి తెర మీద సూపర్ స్టారైన ప్రదీప్ పెద్ద తెర మీద ఏ మేరకు ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తాడో చూడాలి.