Anchor Pradeep MAchiraju Driving License Cancelledడిసెంబర్ 31వ తేదీ పోలీసుల డ్రంకెన్ డ్రైవ్ లో దొరికిపోయిన టాలీవుడ్ టాప్ యాంకర్ ప్రదీప్, ఎట్టకేలకు శుక్రవారం నాడు నాంపల్లి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టుకు హాజరయ్యాడు. పరిమితికి మించి మద్యం తాగిన కేసుతో పాటు, కారుకు బ్లాక్ ఫిల్మ్ తొలగించని కేసు అతనిపై నమోదైన సంగతి తెలిసిందే.

డ్రంకెన్ డ్రైవ్ లో దొరికిపోయిన తరువాత, ఈ నెల 7వ తేదీ వరకూ కౌన్సెలింగ్ కు రాకుండా, పోలీసుల ఆగ్రహానికి గురైన ప్రదీప్, ఆ తరువాత కౌన్సెలింగ్ కు హాజరైనప్పటికీ, ఆపై షూటింగ్ ఉందని చెబుతూ కోర్టుకు రాలేదు. 22వ తేదీన కోర్టుకు హాజరవుతానని చెప్పిన ప్రదీప్, నేడు కోర్టుకు వచ్చాడు.

డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించిన వేళ అతని రక్తంలో 178 పాయింట్ల ఆల్కహాల్ ఉన్నట్టు తేలడంతో, మూడేళ్ల పాటు డ్రైవింగ్ లైసెన్స్ ను రద్దు చేస్తూ నాంపల్లి న్యాయస్థానం తీర్పు నిచ్చింది. లైసెన్స్ రద్దు చేయడంతో పాటు ప్రదీప్ కు 2,100 రూపాయలు జరిమానా కూడా విధించింది.

డ్రంకెన్ డ్రైవ్ కు వ్యతిరేకంగా మీడియాలో ప్రచారం చేసిన మీరు మద్యం సేవించి వాహనం నడిపితే ఎలా? అని ప్రదీప్ ను న్యాయమూర్తి ప్రశ్నించినట్టు సమాచారం. ‘ఆ రోజు డ్రైవర్ లేనందున నేనే కారు డ్రైవ్ చేశాను’ అని ప్రదీప్ సమాధానం చెప్పారట. ముందుగా అంచనా వేసిన ప్రకారం జైలు శిక్ష పడుతుందని భావించగా, కేవలం లైసెన్స్ రద్దు వరకే కోర్టు తీర్పు ఇవ్వడంతో ప్రదీప్ ఊపిరి పీల్చుకున్నట్లయ్యింది.