Anchor Anasuyaకనిపించే శత్రువుతో ఎంతైనా యుద్ధం చేయొచ్చు. తాడో పేడో తేల్చుకోవచ్చు. కానీ మనతో తలపడేందుకు ఇష్టం లేని సిద్ధపడని ప్రత్యర్థి కాని వ్యక్తిని పదే పదే లక్ష్యంగా పెట్టుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ఖుషి పోస్టర్లో పేరు ముందు విజయ్ దేవరకొండకు ది ఉండటం పట్ల ఇన్ డైరెక్ట్ గా అభ్యంతరం వ్యక్తం చేస్తూ వ్యంగ్యమాడిన అనసూయ తీరు గురించి ముందుగా స్పందించింది మిర్చి9. ఆ తర్వాత ఇతర మీడియా వర్గాలు, ట్విట్టర్, ఇన్స్ టాలో ఆవిడ మీద గట్టి కౌంటర్లే వచ్చాయి. నిజానికి పదే పదే దేవరకొండను టార్గెట్ చేసుకోవడం పట్ల దాదాపు అందరూ తప్పు బట్టారు. అక్కడితో ఆగకుండా అతని ఫ్యాన్స్ కామెంట్స్ కి రెచ్చగొట్టేలా ట్వీట్లు పెట్టడం కూడా మరింత పొగరాజేసింది.

ఇక్కడితో కథ ఆగిపోతే రేపో ఎల్లుండో అందరూ మర్చిపోయేవారు. కానీ అనసూయకది ఇష్టం లేదు కాబోలు. ఈసారి మీడియా ప్రస్తావన తెచ్చి తనలాంటి పేరున్నవాళ్లను వాడుకుని కడుపు నింపుకుంటోందని వీడియో రూపంలో సెటైర్ వేసింది. ఇక్కడ ఆవిడ మర్చిపోతున్న ప్రాధమిక లాజిక్ ఏంటంటే సెలబ్రిటీలు ఎవరైనా సరే జనం మెదళ్లలో నానుతూ ఉండాలంటే మీడియా మద్దతు అవసరం. ఎవరో ఒకరు రాయకపోతే గుర్తు చేసుకునే కాలమా ఇది. ఆ మాటకొస్తే పేరున్నవాళ్ళకు ఫలానా కొలమానం అంటూ లేదు. ఐమ్యాక్స్ బయట బ్రో బ్రో అంటూ కేకలు రివ్యూలు చెప్పే వ్యక్తి ఇవాళ సినిమాలు సీరియల్స్ లో బిజీ అయిపోయాడు. స్టార్ హీరోల పక్కన వేషాలు పడుతున్నాయి.

ఇతనిది పేరు కాదా. జబర్దస్త్ ఆర్టిస్టులు ఎక్కడికి వెళ్లినా పబ్లిక్ ఈవెంట్లు చేసినా తండోపతండాలుగా పబ్లిక్ వస్తున్నారు. వాళ్ళకేమీ పవన్ మహేష్ రేంజ్ ఫాలోయింగ్ ఉండదు. అయినా ఎగబడతారు. కాబట్టి పేరున్నవాళ్ళనే ఉపమానం కేవలం కొందరికే మాత్రమే దక్కుతుందనుకుంటే అమాయకత్వమే. ఆ మాటకొస్తే అనసూయ ‘ది’ రగడ మొదలుపెట్టింది మీడియాలో వస్తుందనే కదా. లేదూ వద్దనుకున్నప్పుడు నేరుగా విజయ్ దేవరకొండకే ఫోన్ చేసి ఇలా ఎందుకు ది పెట్టుకున్నావని ఫ్రెండ్లీగా అడిగి ఉంటే సరిపోయేది. ఇదంతా జరిగేది కాదు. పబ్లిక్ లో ఉన్నప్పుడు మీడియా అయినా సరే బయటి జనంలో అయినా రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉంటాయి.

వాటిని అంగీకరిస్తూ ముందుకు వెళ్లాల్సిందే. అంతే తప్ప మీకు ధైర్యం ఉంటే అది రాయండి ఇది రాయండి అంటూ రెచ్చగొట్టడం వల్ల కలిగే నష్టం ఎవరికి. వీధి యుద్ధాల మాదిరి జుత్తులు కొప్పులు పట్టుకునే యుగంలో మనం లేం. ఏదున్నా ప్రత్యక్షంగా కలుసుకుని మాట్లాడే అవకాశం లేని ఆన్ లైన్ ప్రపంచంలో బ్రతుకుతన్నాం. మనం ఎవరికైనా ప్రవచనాలు చెప్పొచ్చు మనకు మాత్రం ఎవరూ కనీసం సలహా ఇవ్వకూడదంటే దాన్ని డబుల్ స్టాండర్డ్ అంటారు. అసలు ధైర్యంగా నేను ఫలానా మనిషిని ఈ విషయంగా ప్రశ్నిస్తున్నానని నేరుగా హీరో పేరు చెప్పలేని దాగుడుమూతల ఆట ఆడుతున్నప్పుడు అవతలి టీమ్ కి నీతులు చెప్తే ఎలా. అవసరమైతే ప్రధాని సిఎంలనే మీడియా ప్రశ్నిస్తున్న జనరేషన్ లో ధైర్యం గురించి క్లాసులు తీసుకోవడం సినిమాను మించిన కామెడీ.