Anasuya Bharadwaj Vijay Deverakonda Twitter Warవాడుతున్న మొహాలు కనిపించనంత మాత్రాన సోషల్ మీడియా ప్రభావాన్ని తక్కువంచనా వేయలేం. సినిమా కావొచ్చు సార్వత్రిక ఎన్నికలు కావొచ్చు దీన్ని సీరియస్ గా తీసుకోవడం గత కొన్నేళ్లలో విపరీతంగా పెరిగింది. ది కాశ్మీర్ ఫైల్స్ ని జనం ఎగబడి చూసినా ప్రధాని మోడీ రెండోసారి పీఠం అధిష్టించినా ఎంతో కొంత చేయూత సదరు ఆన్ లైన్ వర్గాల నుంచి వచ్చింది. ఫోర్ జి ఇంటర్ నెట్ వాడకం ఎక్కువయ్యాక సెలబ్రిటీలు ట్విట్టర్ ఇన్స్ టాల మీద ఫోకస్ చేయడం మొదలుపెట్టారు. ఫ్యాన్స్ తో మాట్లాడేందుకు వేదికగా మార్చుకున్నారు.

నేరుగా చెప్పకపోయినా రెండు మూడు లైన్లలో పెట్టే మాటలు కామెంట్లు చాలా దూరం తీసుకెళ్తాయి. యాంకర్ అనసూయ నిన్న ఖుషి పోస్టర్ లో విజయ్ దేవరకొండ పేరు ముందు ‘ది’ ఉండటం చూసి వ్యంగ్యంగా ట్వీట్ పెట్టింది.

దీంతో సహజంగానే రౌడీ ఫ్యాన్స్ కు కోపం వస్తుంది. దాన్ని రకరకాలుగా వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. అందులో అసభ్యత కూడా ఉంది. సరే ఎవరి ఖర్మ వాళ్ళదని వదిలేస్తే ఇబ్బంది లేదు. మళ్ళీ స్క్రీన్ షాట్లు పెట్టి సంస్కారం గురించి క్లాసులు తీసుకుంటూ ఇంకా రెచ్చగొట్టేలా వ్యవహరిస్తే ఎక్కడిదాకా వెళ్తుంది.

నిజానికి పేరు ముందు ది పెట్టుకోవడం నేరం కాదు. అలా అని చట్టమూ లేదు. ప్రెసిడెంటనో ముఖ్యమంత్రనో సంభోదించుకుంటే తప్పు కానీ ఉత్త ది(THE)కి ఇంత రచ్చ అనవసరం.

అభిప్రాయాల సంగతి ఎలా ఉన్నా అనసూయ ఉన్నది ఇండస్ట్రీలోనే. టీవీకే పరిమితం కాకుండా సినిమాల్లోనూ మంచి వేషాలొస్తున్నాయి. అలాంటప్పుడు కోరి వివాదాలు తెచ్చుకోవడం నన్ను బూతులు తిడుతున్నారని ఇంట్లో వాళ్ళను నిందిస్తున్నారని పోలీస్ కంప్లైంట్లు ఇవ్వడం వ్యర్థం. అదేంటి తప్పుని ఎత్తి చూపకూడదా అనే లాజిక్ చెల్లదు.

ముఖ్యంగా ట్విట్టర్ లో ముప్పాతిక పైగా అన్నీ ఫేక్ దందాలే. ప్రముఖులను ఒకడు తిడుతున్నాడంటే తనను పట్టుకునే అవకాశం లేదని తెలిసే వచ్చిన ధైర్యం అది. వాడి హ్యాండిల్ మొత్తం వెతికినా ఒక్క ఒరిజినల్ ఫోటో దొరకదు. అలాంటి వాళ్ళ మాటలను పట్టుకుని శోకాలు శల్యపరీక్షలు చేసి లాభం లేదు.

అసలు ఏ హీరో అయినా సరే హఠాత్తుగా సూపర్ స్టార్ అని పెట్టుకున్నా ఎవరూ అడగడానికి ఉండదు. చట్టం మహేష్ బాబుకొకటే ఆ హక్కు ఇవ్వలేదు. కానీ భావ్యం కాదని ఎవరూ వట్టి పుణ్యానికి అవతలి వాళ్ళ ట్యాగులు తీసుకోరు. పుట్టగొడుగులా కోట్లలో ఉండే స్టార్ హీరోల ఫ్యాన్స్ తో ఇలా అజ్ఞాతయుద్ధం చేయడం వల్ల టైం వేస్ట్ తప్ప ఒరిగేదేముంటుంది.