Kalaavathi - Sarkaru Vaari Paata -Mahesh Babu - Keerthy Suresh“సర్కార్ వారి పాట” నుండి విడుదలైన ‘కళావతి’ సాంగ్ అభిమానులను, సంగీత ప్రియులను అలరిస్తున్న విషయం తెలిసిందే. తొలి 24 గంటల్లో అత్యధిక క్లిక్స్ ను, లైక్స్ ను సొంతం చేసుకున్న తెలుగు పాటగా ‘కళావతి’ నీరాజనాలు అందుకుంటోంది. ‘పుష్ప’లోని సమంత పాట ‘ఉ అంటావా ఊ అంటావా’ యూట్యూబ్ రికార్డులను ‘కళావతి’ అధిగమించింది.

ఇదిలా ఉంటే ఈ పాటను ఆలపించిన లేటెస్ట్ సెన్సేషనల్ సింగర్ సిడ్ శ్రీరామ్ పై విమర్శల వెల్లువ మళ్ళీ ప్రారంభమైంది. సూపర్ హిట్ సాంగ్స్ తో టాప్ సింగర్ గా ప్రస్తుతం టాలీవుడ్ ను ఏలుతోన్న ఈ యువ సంచలనం సిడ్ శ్రీరామ్ తెలుగు ఉచ్ఛారణ మరోసారి హాట్ టాపిక్ కావడంతో ఈ విమర్శలు మళ్ళీ తెరపైకి వచ్చాయి.

ఇదే పాటను తాజాగా ఓ మీడియా ఛానల్ లో అనంత శ్రీరామ్ ఆలపించారు. ‘కళావతి’ పాటకు వస్తోన్న అనూహ్య స్పందనతో రచయిత అనంత శ్రీరామ్ ను ఓ మీడియా ఛానల్ సంప్రదించగా, ఈ సందర్భంగా ఈ పాటలోని లిరిక్స్ ను శ్రీరామ్ పాడి శ్రోతలకు వినిపించారు. దీనికి సోషల్ మీడియా నుండి భారీ స్పందన లభిస్తోంది.

ముఖ్యంగా తెలుగు ఉచ్ఛారణకు సంబంధించి సిడ్ శ్రీరామ్ కు, అనంత శ్రీరామ్ కు ఉన్న వ్యత్యాసం ఏమిటో స్పష్టంగా కనపడుతోందని, మన పాటలకు తెలుగు గాయకులనే తీసుకోండి అంటూ నెటిజన్లు పోస్ట్ లు చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగుకు తెగులు పట్టించే గాయకులను పక్కన పెట్టేలా చర్యలు తీసుకోమని చెప్తూ ఈ వీడియోను సర్క్యులేట్ చేస్తున్నారు.

అయితే గతంలో కూడా టాలీవుడ్ కు ఇలాంటి పరిణామాలు ఎదురయ్యాయి. ప్రముఖ బాలీవుడ్ గాయకుడు ఉదిత్ నారాయణ్ ఒక దశాబ్దం పాటు టాలీవుడ్ ను ఏలిన విషయం తెలిసిందే. మణిశర్మ – ఉదిత్ నారాయణ్ – మెలోడీ సాంగ్… ఈ మూడు లేకుండా నాటి పెద్ద సినిమాలు ఉండేవి కావన్న రీతిలో ఉదిత్ పాటలు అలరించేవి, ఇప్పటికి ఆ పాటలను వింటూ ఉంటారు కూడా!

కానీ కొన్నాళ్ళకు ఉదిత్ స్వరం మోనాటిని రావడం, అలాగే తెలుగు ఉచ్ఛారణలో తప్పులు దొర్లడంతో నిదానంగా టాలీవుడ్ పక్కన పెట్టేసింది. అయితే సూపర్ హిట్స్ గా నిలిచినంత కాలం మాత్రం ఉదిత్ నారాయణ్ పాటలు ప్రేక్షకులను ఓ రేంజ్ లో అలరించాయి. ప్రస్తుతం సిడ్ శ్రీరామ్ జర్నీ కూడా నాటి ఉదిత్ నారాయణ్ మాదిరే కనపడుతోంది.

పాడిన ప్రతి పాట సూపర్ హిట్ గా నిలుస్తుండటంతో సంగీత దర్శకులు కూడా ఓ పాటను సిడ్ చేత పాడించాలని ఫిక్స్ అయిపోతున్నారు. అలాగే దర్శక నిర్మాతలు కూడా ఈ దిశగా సూచనలు కూడా చేస్తున్నారు. తేడా ఎక్కడ వస్తుందంటే… ఓ స్థాయి హీరోల వరకు ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోరు, కానీ టాప్ స్టార్స్ కు పాడినపుడు మాత్రం ఫోకస్ బాగా ఉంటుంది గనుక, మెప్పు అయినా, బుక్ అయినా అప్పుడే ఉత్పన్నం అవుతుంది.