Anam Ramanarayana Reddyఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత వైసీపీ నుంచి సస్పెండ్ చేయబడిన నలుగురు ఎమ్మెల్యేలలో ఆనం రామనారాయణ రెడ్డి కూడా ఒకరు. ఆయన పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే తన నెల్లూరు జిల్లా, వెంకటగిరి నియోజకవర్గంలో చేయవలసిన అభివృద్ధి పనుల గురించి ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తూనే ఉన్నారు. కానీ ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోగా తనని పక్కనపెట్టేసి, మరో వ్యక్తిని నియోజకవర్గం ఇన్‌ఛార్జ్‌గా నియమించి అవమానించిందని ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలపై తన అభిప్రాయాలను పార్టీ అంతర్గత సమావేశాలలో పలుమార్లు చెప్పినప్పటికీ సిఎం జగన్మోహన్ రెడ్డి పట్టించుకొనేవారు కారని అన్నారు. సిఎం జగన్మోహన్ రెడ్డి తనకు నిత్యం భజన చేసే ఓ సలహాదారుడి మాటలే వింటూ, కూర్చొన్న కొమ్మను నరుక్కొంటున్న వ్యక్తిలా వ్యవహరిస్తున్నారని ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు.

నేను టిడిపి దగ్గర రూ.10 కోట్లు డబ్బు తీసుకొని క్రాస్ ఓటింగ్ చేశానని ఆరోపిస్తున్న సదరు సలహాదారుడు మూడున్నరేళ్ళలో వేలకోట్ల రూపాయల ఆస్తులు ఏవిదంగా సంపాదించారో చెప్పాలని ఆనం రామనారాయణ రెడ్డి సవాలు విసిరారు. అవినీతి సొమ్ముకి అలవాటు పడిన వైసీపీ నేతలు, అందరూ తమలాగే అవినీతిపరులై ఉంటారని భావిస్తున్నారని ఆనం రామనారాయణ రెడ్డి ఎద్దేవా చేశారు.

“నేను నా రాజకీయ, పరిపాలనానుభవంతో ముఖ్యమంత్రికి తోడ్పడాలని ప్రయత్నిస్తే, దానిని ప్రశ్నించడం, ఎదురుతిరగడంగా భావించి తొక్కేశారు. చివరికి జిల్లా అధికారులందరూ నాకు దూరంగా ఉండాలని సీఎంవో నుంచి ఫోన్లు వెళ్ళేవి. ప్రజాస్వామ్యమంటే గౌరవం లేని ఇలాంటి పార్టీతో, నేతలతో ఇంతకాలం కలిసి పనిచేసినందుకు నేను సిగ్గుపడుతున్నాను. వైసీపీలో నుంచి నన్ను బయటకు పంపడం వలన జిల్లాలో వైసీపీయే నష్టపోతుంది తప్ప నేను కాదు. వచ్చే ఎన్నికలలో నేను తప్పకుండా పోటీ చేస్తాను. ఏ పార్టీ తరపున చేస్తాననే విషయం రాబోయే రోజుల్లో చెప్తాను,” అని అన్నారు.