Anam Ramanarayana Reddyమాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఈరోజు ఉదయం నెల్లూరులో తన ఓటు హక్కు వినియోగించుకొన్నారు. బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ, “ఆత్మ ప్రభోదం ప్రకారమే ఓటు వేశాను. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు పూర్తిగా భ్రష్టుపట్టిపోయాయి. వాటిలో పోలీస్, ఎన్నికల వ్యవస్థలు కూడా ఉండటం చాలా బాధ కలుగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికలలో జరుగుతున్న అక్రమాలు, డబ్బు పంపిణీ, బెదిరింపుల గురించి మీడియాలో వస్తున్న వార్తలు చూస్తున్నప్పుడు చాలా బాధ కలుగుతోంది.

ఒకప్పుడు ప్రజలకు కష్టం వస్తే పోలీసులను ఆశ్రయించేవారు. కానీ ఇప్పుడు పోలీస్ అధికారులే అధికార పార్టీ నాయకులను చూసి భయపడుతున్నారు. రాష్ట్రంలో ఎన్నికల వ్యవస్థ అసలు ఉందా లేదా?అనే సందేహం కలుగుతోంది. ఇన్ని అక్రమాలు జరుగుతున్నాయని రోజూ వార్తలలో వీడియో రూపంలో చూపిస్తున్నా ఎన్నికల సంఘంలో చలనమే కలుగడం లేదు. ఎందుకంటే ఎన్నికల అధికారులు కూడా అధికార పార్టీ నాయకులను చూసి భయపడుతున్నారు కనుక! రాష్ట్రంలో అధికారులు, ప్రజలు అందరూ నిస్సహాయులైపోయి చూస్తుండిపోతున్నారు. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఇక రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కనబడకుండా అదృశ్యమైపోతుంది,” అని ఆనం రామనారాయణ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

ఆయన వైసీపీలో ఉంటూ తమ ముఖ్యమంత్రి, ప్రభుత్వం తీరుపై తీవ్ర అసంతృప్తి, అసహనం వ్యక్తం చేస్తుండటంతో ఆయనను పార్టీ దూరంగా పెట్టింది. అయితే అందుకు ఆయన ఏమాత్రం బాధపడలేదు. ఇటువంటి నీచ రాజకీయాలు తాను చేయలేనని, ఈ బురదలో కూరుకుపోవాలనుకోవడం లేదని స్పష్టంగా చెప్పి వైసీపీకి దూరంగా ఉంటున్నారు.

మళ్ళీ చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు రావడంతో రాష్ట్రంలో పరిస్థితుల గురించి తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆయన చెప్పినవి వాస్తవాలే కావచ్చు కానీ ఇప్పుడు అందరికీ ఎదురవుతున్న సమస్యల గురించి మరోసారి వల్లెవేయడం వలన ఏ ప్రయోజనమూ ఉండదు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని ఈ సమస్యల నుంచి గట్టెకించి రాష్ట్రాన్ని గాడినపెట్టి ప్రజలు ప్రశాంతంగా జీవించేలా చేయగల సమర్దుడైన నాయకుడు కావాలి. అటువంటి గొప్ప నాయకుడు కోసం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలందరూ ఎదురుచూస్తున్నారు. కానీ ఇంకా ఎంతకాలం ఈ నిరీక్షించాలో… ఎవరికీ తెలీదు.