Anam Ramanarayana Reddyఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అసలైన విలన్ జగన్ మోహన్ రెడ్డేనని, అసలు ఎప్పటికీ హీరో కాజాలడు అంటూ నెల్లూరు నేత ఆనం రాంనారాయణరెడ్డి విమర్శలు చేసారు. రాజకీయాల్లో జగన్ పతనం తధ్యం అన్న ఆనం, రాష్ట్రానికి అసలైన హీరో చంద్రబాబు నాయుడు మాత్రమేనని అన్నారు. జగన్ హావభావాలు అచ్చం విలన్ లా ఉంటాయని, కుల రాజకీయాలు చేస్తూ కాలం గడుపుతున్నారని మండిపడ్డారు.

24 రీళ్ళు (రెండు సంవత్సరాల కాలం) పూర్తయిన తర్వాత కూడా జగన్ కు సినిమా అర్ధం కావట్లేదని ఎద్దేవా చేసిన ఆనం, గతంలో అనేక ప్రభుత్వాలు పట్టించుకోని కాపు రిజర్వేషన్ అంశానికి మొట్టమొదటి సారిగా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని ప్రభువం ప్రాధాన్యత ఇచ్చి, ఓ కమిటీని ఏర్పాటు చేసారని, అలాగే దానికి 1000 కోట్లు నిధులు కేటాయించారని, సమస్యను పరిష్కరించే దిశగా చర్చలు జరుగుతుంటే… జగన్ కుల రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుతున్నారని విమర్శలు చేసారు.

నేటి ముద్రగడ పరిస్థితికి అసలు కారణం మీరేనని, కేవలం ఒక కులానికి ప్రాతినిధ్యం వహించాలని భావిస్తే… అది రాజకీయ లబ్ధి కాదు, రాజకీయ సమాధికే దారి తీస్తుందని అన్నారు ఆనం. విజయవాడలో పార్టీ ఆఫీసును ప్రారంభించిన నేపధ్యంలో చంద్రబాబును ‘విలన్’గా అభివర్ణిస్తూ జగన్ చేసిన కామెంట్లకు ప్రతిగా… జగన్ తీరును ఎండగడుతూ రాష్ట్రానికి అసలు విలన్ ‘యువనేత’ మాత్రమేనని కితాబిచ్చారు ఆనం.