Anam-Rama-Narayana-Reddy-and-Anam-Vivekananda-Reddyటిడిపి కార్యకర్తలు ఎంతగా ప్రతిఘటించినా “ఆనం” బ్రదర్స్ ఎంట్రీ ఖరారయ్యింది. డిసెంబర్ 2వ తేదీన ఉదయం 9 గంటలకు విజయవాడలోని సిఎం క్యాంప్ ఆఫీస్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో అధికార పార్టీలో చేరనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఇప్పటికే ఖరారైనట్లుగా సమాచారం. ఇదిలా ఉంటే, ఆనం బ్రదర్స్ ఎంట్రీలపై టిడిపిలో భిన్న స్పందనలు వినపడుతున్నాయి.

చిన్నవాడైన ఆనం రాంనారాయణ రెడ్డి పార్టీలోకి రావడంపై తెలుగుతమ్ముళ్లు పెద్దగా అభ్యంతరాలు చెప్పడంలేదు. మొదటి నుంచీ రాజకీయాల్లో రాంనారాయణరెడ్డి కొంత హుందాగానే వ్యవహరించారని, సో.. ఆయన పార్టీలోకి రావడంపై తమకు అభ్యంతరం లేదంటున్నారు. అయితే, పెద్దవాడైన ఆనం వివేకానంద రెడ్డి టీడీపీలోకి రావడాన్ని మాత్రం ఆ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.

ఇప్పటికే దీనికి సంబంధించి పార్టీ అధినేత చంద్రబాబుకు ఫ్యాక్స్, లేఖలు కూడా అందాయి. ఈ విషయాన్ని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు ధృవీకరించారు కూడా. అయితే, పార్టీలో కొత్తవారు చేరిక సమయంలో ఇటువంటి అభిప్రాయాలు రావడం సహజమేనని, ఇరు వర్గాల్ని కూర్చోబెట్టి చర్చించాల్సిన అవసరం ఉందని వెంకట్రావు అంటున్నారు. చివరికి తెలుగు తమ్ముళ్లు ఎలా శాంతిస్తారో చూడాలి.