analysis on ys jagan ysrcp victoryఎన్నికలలో వైఎస్సార్ కాంగ్రెస్ సంచలనమైన విజయం నమోదు చేసింది. 175 ఎమ్మెల్యే సీట్లలో 151 సీట్లలో, 25 ఎంపీ సీట్లలో 22 కైవసం చేసుకుని సంచలన నమోదు చేసుకుంది. ఇది సంచలన విజయమని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తీ లేదు. అయితే లోతుగా వెళ్లి చూసే కొద్దీ ఇంకా అనితరసాధ్యమైన విజయమని మనకు అనిపించకమానదు. వివరాల్లోకి వెళ్తే 2014 ఎన్నికలలో వైఎస్సార్ కాంగ్రెస్ గెలిచింది కేవలం 67 సీట్లు. అయితే ఈ సారి ఆ పార్టీ నుండి మొట్టమొదటి సారిగా అసెంబ్లీకి వెళ్ళిన వారి సంఖ్య అదే 67.

తెలుగుదేశం పార్టీ నుండి కొత్తగా ఎన్నికైన వారు కేవలం ముగ్గురంటే ముగ్గురు. దీని బట్టి అభ్యర్థులు ఎవరు అనే ప్రమేయం లేకుండా జగన్ చూసి ఓట్లు వేశారని అనుకోవాలి. టీడీపీ అభ్యర్థులు ఎవరో ఒకరిద్దరు తప్పించి అందరూ స్వల్ప మెజారిటీలతో గెలిచిన వారే. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపులు మాత్రం భారీగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా రాయలసీమలో ఆ పార్టీ అనేక చోట్ల సాధించిన మెజారిటీలు ప్రత్యర్థులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తాయి.

ఎన్నికైన 151 ఎమ్మెల్యేలలో 48 మందికి ముప్పయి వేల మెజారిటీ పైన సాధించారు. ఈ క్రమంలో ఎన్నో టీడీపీ కంచుకోటలు బీటలు వారాయి. మరోవైపు జగన్ ఈ నెల 30న ప్రమాణస్వీకారం చెయ్యబోతున్నారు. ఆ రోజు మంత్రులు ప్రమాణస్వీకారం చేసే అవకాశం లేదని తెలుస్తుంది. కొంత సమయం తీసుకుని తన టీం కూర్పుని ఫైనల్ చెయ్యాలని జగన్ భావిస్తున్నారట. వైఎస్సార్ కాంగ్రెస్ లో భారీ ఎత్తున ఆశావహులు ఉన్నా మంత్రివర్గాన్ని 25 మందికే పరిమితం చెయ్యాలని భావిస్తున్నారట.