Anajali caught watching Nuvve Kavali Movieతెలుగు హీరోయిన్లు రావడం లేదని మొరపెట్టుకుంటున్న తరుణంలో… తమిళ సినిమాల్లో పేరు తెచ్చుకుని టాలీవుడ్ నాట అడుగుపెట్టిన అంజలి అభినయానికి ప్రత్యేకమైన అభిమానులున్నారు. ప్రస్తుతం తెలుగులో సినిమాలు లేకపోయినా, తమిళంలో జై సరసన ఓ సినిమాలో నటిస్తోంది. సినిమాల్లో బిజీగా ఉంటూ షూటింగ్ జరుపుకుంటున్న నేటి రోజుల కంటే, చిన్నతనంలో అనుభవించిన రోజులు చాలా బాగున్నాయని చెప్తూ తన స్కూల్, కాలేజీ రోజులను గుర్తు చేసుకుంది అంజలి.

తూర్పుగోదావరి జిల్లా రాజోలులో చదువుకున్న తాను… బాగా చదివేదానిని, మా బ్యాచ్‌లో నేనే ఫస్ట్‌, అలాగే చదువుకి మించిన అల్లరి చేసేదాన్ని. అంతేకాదు హైస్కూల్‌ వరకు నేనెప్పుడూ క్లాస్ కి బంక్‌ కొట్టలేదు. దానికి తోడు టెన్త్ లో ఫస్ట్ క్లాస్ వచ్చింది. దీంతో ఇంటర్‌ ఫస్టియర్‌ కి వచ్చేసరికి నా కళ్లు నెత్తికెక్కాయి. సరిగ్గా అప్పుడే ‘నువ్వే కావాలి’ సినిమా విడుదలైంది. సూపర్ హిట్ టాక్ తోపాటు… యూత్‌ లో ఆ సినిమాకు బాగా క్రేజ్‌ ఏర్పడింది. దాంతో ఆ సినిమా ఎలాగైనా చూడాలనుకున్నాను.

కాలేజీకి బంక్ కొట్టామని తెలిస్తే ఇంట్లో తిడతారు, ఒకవేళ దగ్గర్లో ఉన్న సినిమా హాలుకి వెళ్తే ఇంట్లో తెలిసిపోతుంది. అందుకే ఒక రోజు కాలేజీకి బంక్‌ కొట్టి, కొంచెం ఎక్కువ దూరంలో ఉన్న సినిమా హాల్‌ కు ఫ్రెండ్స్ తో వెళ్లాను. ఎవరూ చూడరని ధైర్యంగా ఉన్నాను. సినిమా చూసి ఇంటికి ఆనందంగా చేరుకున్నాను. అయితే నేను ఇంటికి చేరే లోపే నేను కాలేజీకి బంక్ కొట్టి సినిమాకు వెళ్లానన్న వార్త చేరిపోయింది. అంతే ఇంట్లో వాళ్లు నన్ను చితక్కొట్టేశారు. ఆ తర్వాత మళ్లీ ఎప్పుడూ కాలేజీకి బంక్‌ కొట్టి సినిమాకు గానీ, షికారుకు గానీ వెళ్లలేదు. ఆ రోజులు తలచుకుంటే ఇప్పటికీ ఎంత బాగా అనిపిస్తుందో… అంటూ ‘నువ్వేకావాలి’ సినిమాతో తాను బుక్ అయిన విషయం గురించి చెప్పుకొచ్చింది.