Rs 5582.83 crore withdrawn from Jan Dhan accountsదేశంలో ఉన్న నల్లధనాన్ని వెలికితీయాలనే సంకల్పంతో ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద నోట్లను రద్దు చేసి, ఆ నోట్లను కొత్త నోట్లతో మార్చుకోవడానికి పలు నియమ నిబంధనలను విధించినప్పటికీ, 90 శాతంకు పైగా కరెన్సీ బ్యాంకులకు చేరింది. దీంతో ఇండియాలో అసలు నల్లధనమే లేదా? అంటూ దేశప్రజలే కాస్త ఎటకారంగా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఎన్ని కఠిన షరతులు పెట్టినా, సదరు కరెన్సీ బ్యాంకులకు ఎలా చేరింది? అంటే… మోడీ కంటే తామే తెలివైనవారమని నల్లకుభేరులు మరోసారి నిరూపించుకున్నారు గనుక!

ఆర్బీఐ అధికారుల నుండి జన్ ధన్ ఖాతాల వరకు ఏ ఒక్క అంశాన్ని విడిచిపెట్టని నల్లకుభేరులు, తమ వద్దనున్న డబ్బంతా బ్యాంకులకు విజయవంతంగా చేర్చడంలో సఫలీకృతులయ్యారని తాజా నివేదికలే స్పష్టం చేస్తున్నాయి. పెద్ద నోట్ల డిపాజిట్ గడువు ముగిసిన నెల రోజుల్లోనే దేశ‌వ్యాప్తంగా ఉన్న జ‌న్‌ ధ‌న్ ఖాతాల నుంచి 5,582 కోట్ల న‌గ‌దు విత్ డ్రా అయిన‌ట్టు ఆర్థిక‌ శాఖ గ‌ణాంకాలు చెబుతున్నాయి. డిసెంబ‌రు 7వ తేదీ నాటికి జ‌న్‌ ధ‌న్ ఖాతాల్లో 74,610 కోట్లు ఉండ‌గా, జ‌న‌వ‌రి 11 నాటికి ఆ మొత్తం 69,027.17 కోట్ల‌కు త‌గ్గింది.

అంటే దాదాపు నెల రోజుల్లోనే ఏకంగా 5,582 కోట్లు విత్‌ డ్రా అయ్యింది. అది కూడా రోజుకు 4500 నగదు విత్ డ్రా నిబంధనతో మాత్రమే! దేశవ్యాప్తంగా మొత్తం 26.68 కోట్ల జ‌న్‌ ధ‌న్ ఖాతాలు ఉండ‌గా వాటిలో గ‌రిష్ట డిపాజిట్ ప‌రిమితి 50 వేల రూపాయలే. నోట్ల ర‌ద్దుకు ముందు అంటే గ‌తేడాది న‌వంబ‌రు నాటికి 25.5 కోట్ల ఖాతాల్లో 45,636.61 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. స‌రిగ్గా నెల తర్వాత ఈ మొత్తం 74,610 కోట్ల‌కు చేరుకుంది. నోట్ల రద్దు త‌ర్వాత దాదాపు 28,973 కోట్లు ఖాతాల్లో చేరిన‌ట్టు తాజా గ‌ణాంకాలు చెబుతున్నాయి. అంటే ప్ర‌భుత్వం ర‌ద్దు చేసిన నోట్లు ఈ ఖాతాల్లో పెద్ద మొత్తంలో చేరాయ‌న్న‌ మాట‌.